- మోదీ, షా, అదానీ, అంబానీ దుష్టచతుష్టయం పన్నాగం ఇదే: సీఎం రేవంత్
- ఢిల్లీ పాలకులే ఓటర్లను నిర్ణయిస్తున్నరు
- దేశంలో గాంధీ వర్సెస్ గాడ్సే వారసుల మధ్యే పోరాటం
- రాహుల్ ప్రధాని కావాలంటే రాష్ట్రంలో 15 ఎంపీ సీట్లు గెలవాలె
- దేశ రాజ్యాంగం, కాంగ్రెస్ రాజ్యాంగం ఒక్కటే: కాంగ్రెస్ ఇన్చార్జి బీఎం సందీప్
- ట్యాంక్‌బండ్ నుంచి నెక్లెస్ రోడ్ దాకా ‘సంవిధాన్ రక్షా మార్చ్’
హైదరాబాద్, వెలుగు: ఓటర్ల జాబితాల నుంచి ఓట్లు తొలగించి నాలుగోసారి అధికారంలోకి రావాలని ప్రధాని మోదీ, అమిత్ షా, అదానీ, అంబానీ దుష్టచతుష్టయం కుట్ర పన్నుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో గాంధీ, నెహ్రూ, పటేల్, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అందిస్తే, అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలనే దురుద్దేశంతో కొందరు రాజ్యాంగంపైనే దాడి చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగంపై ‘మోదీ ముఠా’ చేస్తున్న దాడిని ఇందిరా గాంధీ ఇచ్చిన స్ఫూర్తితో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ పిలుపు మేరకు పీసీసీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో ‘సంవిధాన్ రక్షా మార్చ్’ నిర్వహించారు. ట్యాంక్‌బండ్‌పై అంబేద్కర్ విగ్రహానికి సీఎం పూలమాల వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి బీఎం సందీప్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అజారుద్దీన్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలతో కలిసి నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. పాలనను ప్రజల చేతుల్లో పెట్టాలనే నెహ్రూ, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అందించారని, గిరిజనులు, దళితులు, మహిళలు, మైనారిటీలకు ఓటు హక్కు కల్పించారని గుర్తుచేశారు. నాడు పేదలు, మహిళలకు ఓటు హక్కు వద్దన్నవారి వారసులే నేడు ఆ వర్గాల ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
ఢిల్లీ పాలకులే ఓటర్లను నిర్ణయిస్తున్నరు
‘రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, నల్లధనం తెచ్చి ప్రజల ఖాతాల్లో వేస్తామనే హామీలతో 2014లో మోదీ మొదటిసారి అధికారంలోకి వచ్చారు. కుల, మత భేదాలు, తప్పుడు హామీలతో రెండోసారి, మూడోసారి వచ్చారు. ఇప్పుడు ఓట్ల తొలగింపుతో నాలుగోసారి రావాలని చూస్తున్నారు’ అని సీఎం ఆరోపించారు. ఇప్పటిదాకా పాలకులు ఎవరో రాజ్యాంగం ప్రకారం ఓటర్లు నిర్ణయిస్తే, ఇప్పుడు ఢిల్లీ పాలకులే ఓటర్లను నిర్ణయిస్తున్నారని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తున్న దళితులు, గిరిజనులు, మహిళలు, మైనారిటీలకు చెందిన 13 కోట్ల ఓట్లను సర్ పేరుతో తొలగించారని, మరో 7 కోట్ల ఓట్ల తొలగించే కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. జ్ఞానేశ్ కుమార్‌ను సీఈసీగా తెచ్చి, ఈసీని అడ్డంగా వాడుకుని ఓటర్ లిస్టుల్లో అర్హుల పేర్లు తీసేస్తున్నారని ఆరోపించారు.
దేశ, కాంగ్రెస్ రాజ్యాంగం ఒక్కటే: సందీప్
దేశ రాజ్యాంగం, కాంగ్రెస్ రాజ్యాంగం ఒక్కటేనని, స్వాతంత్ర్య పోరాటంలో ఆర్ఎస్ఎస్కు గానీ, ఒక్క సంఘ్ కార్యకర్తకు గానీ ఇసుమంత భాగస్వామ్యం కూడా లేదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి బీఎం సందీప్ అన్నారు. ‘శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అంటే మోదీ రైతులను చంపేస్తున్నారు. ఇందిరా గాంధీ గరీబీ హఠావో అంటే మోదీ పేదలను బతకనివ్వడం లేదు’ అని విమర్శించారు. ఇక్కడ ‘జై కాంగ్రెస్’ అంటే నాగ్‌పూర్ సంఘ్ కార్యాలయంలో వినిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సామాజిక న్యాయం జరిగిందన్నారు.
బీజేపీవి కౌంటర్ ర్యాలీలు: మహేశ్ గౌడ్
రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే బీజేపీ కౌంటర్ ర్యాలీలు చేస్తోందని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆరోపించారు. సీబీఐ, ఈడీ, ఈసీని కేంద్రం జేబు సంస్థలుగా మార్చుకుని ఓట్ల తొలగింపునకు పాల్పడుతోందని, దీన్ని సుప్రీంకోర్టు కూడా తప్పుబట్టిందని అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన గాంధీ కుటుంబం గురించి మాట్లాడే నైతిక హక్కు బండి సంజయ్‌కు, సంఘ్ పరివార్‌కు లేదని మండిపడ్డారు.
మరో ఉద్యమానికి సిద్ధం కావాలె: భట్టి
రాజ్యాంగ పరిరక్షణ కోసం మరో పెద్ద ఉద్యమానికి సిద్ధం కావాలని కాంగ్రెస్ శ్రేణులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన సమానత్వం, భావప్రకటనా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, మహిళలు, కార్మికుల హక్కులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. రాజ్యాంగాన్ని మార్చి ఏకవ్యక్తి నిరంకుశ పాలన తేవాలని బీజేపీ చూస్తోందని, దాన్ని అడ్డుకునేందుకు ఖర్గే, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఐక్యంగా పోరాడాలని కోరారు.
గాంధీ వర్సెస్ గాడ్సే వారసులు
‘ఈ దేశం కోసం గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణత్యాగం చేశారు. దేశ రక్షణ కోసం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ పోరాడుతున్నారు’ అని సీఎం అన్నారు. దేశంలో గాంధీ వారసులు, గాడ్సే వారసుల మధ్య పోరాటం జరుగుతోందని, ‘గాడ్సే వారసుడైన మోదీ కౌరవ సైన్యాన్ని’ ఓడించాలంటే గాంధీ వారసులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇది ఆరంభం మాత్రమేనని, రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలంటే రాష్ట్రంలో 15 ఎంపీ సీట్లు గెలిపించాలని, తెలంగాణలో కోటి ఓట్లు, 90 సీట్లతో కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు నాయకులు, కార్యకర్తలు కష్టపడాలని పిలుపునిచ్చారు.
