వెలుగు స్పెషల్ పేజీ : ధీరవనిత రుద్రమదేవి చారిత్రక ఆనవాలు చందుపట్ల..

వెలుగు స్పెషల్ పేజీ :  ధీరవనిత రుద్రమదేవి చారిత్రక ఆనవాలు చందుపట్ల..

ఒక సామ్రాజ్యాన్ని ఏలిన వీరవనిత.. శత్రువులను ఎదిరించిన ధీరవనిత.. పాలనా దక్షతతో చరిత్రలో చెరగని ముద్ర వేసిన కాకతీయ రాణి రుద్రమదేవి.  కాకతీయ సామ్రాజ్యాన్ని తన పరాక్రమంతో విస్తరించి, శత్రువుల దండయాత్రలను ధైర్యంగా ఎదుర్కొన్న వీరనారి రుద్రమదేవి. పురుషాధిక్య సమాజంలో సామ్రాజ్ఞిగా ఎదిగి, యుద్ధరంగంలో సైతం తన సత్తా చాటిన అపర ధీరవనిత. ఆమె పాలనా దక్షతకు, పోరాట పటిమకు చరిత్రే సాక్ష్యం. అయితే ఆ వీరనారి చివరి ఘట్టానికి సంబంధించిన అరుదైన ఆధారం తెలంగాణలోని నల్గొండ జిల్లా నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలం చందుపట్లలో ఉంది. ఆమె మరణించిన తేదీని తెలిపే శిలాశాసనం ఇక్కడే లభించింది.

రాజ్య విస్తరణలో ఎన్నో యుద్ధాలు చేసిన రుద్రమదేవి.. చివరి శ్వాస వరకు పోరాటానికే  ప్రాధాన్యమిచ్చారు. అంబదేవుడితో జరిగిన యుద్ధంలో క్రీ.శ. 1289 నవంబరు 27న ఆమె మరణించినట్లు చందుపట్ల శిలాశాసనం వెల్లడిస్తోంది. 1962లో  వెలుగులోకి వచ్చిన ఈ శాసనం కాకతీయ చరిత్రలో విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. నేడు రుద్రమదేవి 737వ వర్ధంతి సందర్భంగా ఆమె వీరత్వంతోపాటు చందుపట్లలోని చారిత్రక ఆనవాళ్లు, విగ్రహ ఆవిష్కరణకు ఎదురవుతున్న జాప్యం, గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ప్రజల ఆకాంక్షలను తెలుసుకుందాం.

హామీలకే పరిమితమైన అభివృద్ధి

2015 ఏప్రిల్ 26న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చందుపట్లను సందర్శించారు. గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని, ఏటా కాకతీయ ఉత్సవాలు నిర్వహిస్తామని,  ప్రవేశద్వారం వద్ద కాకతీయ శిలాతోరణం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 2022 జులై 12న అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా గ్రామాన్ని సందర్శించి రుద్రమదేవి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. అయినా ఆచరణలో ఆశించిన మార్పు కనిపించడం లేదు. అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కల్వకుంట్ల కవితతో పాటు పలువురు ప్రముఖులతో విగ్రహాన్ని ఆవిష్కరింపజేయాలనే ప్రయత్నాలు జరిగాయన్న ప్రచారం  స్థానికంగా వినిపించింది. అయితే  కార్యక్రమం ఎందుకు కార్యరూపం దాల్చలేదన్నది ప్రశ్నార్థకంగానే మిగిలింది. రాజకీయ ఒత్తిళ్లా? అధికారుల అలసత్వం వల్ల ఆలస్యం జరిగిందా? అన్నది స్పష్టత లేని అంశం. విగ్రహ పరిసరాల మరమ్మతులు, పచ్చదనం, సుందరీకరణకు ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ సహకారం అందించాలని యువజన మండలి సభ్యులు ప్రతిపాదనలు పంపించారు. నిధుల మంజూరు కోసం ఎదురుచూస్తున్నారు. శాసనాన్ని సంరక్షించి, దాని చరిత్రను తెలిపే సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలి. విగ్రహ పరిసరాలను సుందరీకరించి సందర్శకులకు అవసరమైన వసతులు కల్పించాలి. రుద్రమదేవి గాథకు క్షేత్రస్థాయిలోనూ, రాష్ట్రస్థాయిలోనూ తగిన గుర్తింపు ఇవ్వాలి.

అధికారికంగా నిర్వహించాలి

రుద్రమదేవి వర్ధంతి కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలి.  చందుపట్లను పర్యాటక కేంద్రంగా గుర్తించి అవసరమైన నిధులు మంజూరు చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాకతీయ శిలాతోరణం నిర్మించడంతోపాటు, వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహిస్తున్న తరహాలో ఇక్కడా కాకతీయ ఉత్సవాలు జరపాలి. రుద్రమదేవి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి. . రుద్రమ వర్ధంతి సందర్భంగా చందుపట్ల గ్రామంలో ఈనెల 26న సమ్మక్క, సారలమ్మ నాటక ప్రదర్శన, 27న రుద్రమదేవి నాటక ప్రదర్శన నిర్వహించనున్నారు. రుద్రమ వర్ధంతి సందర్భంగా జరిగే ఈ కార్యక్రమాలకు విగ్రహ ఏర్పాటుకు సహకరించిన దాతలు, చరిత్రకారులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగానైనా విగ్రహాన్ని అధికారికంగా ఆవిష్కరించాలన్నది  గ్రామస్తుల అభిలాష.

- గడగోజు రవీంద్రాచారి
జర్నలిస్ట్‌

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
[email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.