- 33 జిల్లాలకు గాను 32 జిల్లాలకు సురక్షిత్ హోదా
- 97 శాతం లక్ష్యంతో జాతీయ సగటు కంటే మూడు రెట్లు ముందంజ
- ఈ నెల 29 నాటికి రంగారెడ్డికి కూడా హోదా వస్తుంది: మంత్రి దామోదర్ రాజనర్సింహా
- 150 రోజుల ప్రత్యేక మిషన్తో సత్ఫలితాలు
హైదరాబాద్, వెలుగు: ఎయిడ్స్ నియంత్రణలో తెలంగాణ దేశంలోనే ముందంజలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జాతీయ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (నాకో) చేపట్టిన ‘మొబిలైజేషన్ ఫర్ ఎయిడ్స్ సురక్ష’ కార్యక్రమంలో రాష్ట్రం 97 శాతం లక్ష్యాన్ని సాధించింది. రాష్ట్రంలోని 33 జిల్లాలకు గాను 32 జిల్లాలు సురక్షిత్ హోదా దక్కించుకున్నాయి.
ఒక్క రంగారెడ్డి జిల్లా మాత్రమే సక్షమ్ విభాగంలో ఉంది. దేశవ్యాప్తంగా 27 శాతం జిల్లాలే సురక్షిత్ హోదా సాధించగా.. తెలంగాణ మూడు రెట్లకు పైగా ముందంజలో ఉంది. పశ్చిమ బెంగాల్ 83 శాతంతో రెండో స్థానంలో ఉండగా, అరుణాచల్ ప్రదేశ్ 70 శాతంతో తర్వాతి స్థానంలో నిలిచింది. అస్సాం, తమిళనాడు, మహారాష్ట్ర కూడా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
95-95-95 లక్ష్యాలపై ఫోకస్..
2030 నాటికి ఎయిడ్స్ రహిత భారత్ నిర్మించడమే లక్ష్యంగా కేంద్రం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా హెచ్ఐవీ బాధితుల్లో 95 శాతం మందికి వ్యాధి నిర్ధారణ చేయడం, గుర్తించిన వారిలో 95 శాతం మందికి క్రమం తప్పకుండా ఏఆర్టీ మందులు అందించడం, చికిత్స పొందుతున్న వారిలో 95 శాతం మందిలో వైరస్ను అదుపు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. వీటితో పాటు తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవీతో పాటు సిఫిలిస్, హెపటైటిస్-బి సోకకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మూడు లక్ష్యాలను సాధించిన జిల్లాలకు సురక్షిత్ హోదా ఇస్తుండగా.. లక్ష్యానికి దగ్గరగా ఉన్న జిల్లాలను సక్షమ్గా, వెనుకబడిన జిల్లాలను సంఘర్షశీల్గా గుర్తిస్తున్నారు.
150 రోజుల ప్రత్యేక కార్యాచరణ..
తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో 150 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణ అమలు చేశారు. సోచ్ పోర్టల్ ద్వారా రోజువారీ పరీక్షలు, మందుల పంపిణీని వార్రూమ్ నుంచి పర్యవేక్షించారు. వైద్య సిబ్బంది, ఎన్జీవోలు ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించడంతో పాటు గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. మధ్యలో మందులు ఆపేసిన వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చి తిరిగి చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు.
కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయానికి కృషి చేసిన కలెక్టర్లు, వైద్య, ఆరోగ్య సిబ్బందిని సత్కరిస్తూ టీజీఎస్ఏసీఎస్ ఆధ్వర్యంలో సమ్మాన్ సమారోహ్ నిర్వహించారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ, వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్. చోంగ్తు, ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. విద్యాసాగర్ సిబ్బందిని అభినందించారు. మిగిలిన రంగారెడ్డి జిల్లాకు కూడా ఈ నెల 29 నాటికి సురక్షిత్ హోదా వస్తుందని, దీంతో రాష్ట్రం వంద శాతం లక్ష్యాన్ని చేరుకుంటుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
