- నవంబర్ 26నే మహిళలకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిన రోజు: కవిత
- మహిళలను మనుషులుగా గుర్తించింది రాజ్యాంగమే
- సమాన పనికి సమాన వేతనం ఏదీ?
- మహిళల సంపాదనపైనా పెత్తనమేంది?
- కమ్యూనిస్టు, మావోయిస్టు పార్టీల్లోనూ మహిళలపై వివక్ష
- రాజకీయాల్లోకి వస్తే మురికి కామెంట్లతో దాడులు చేస్తున్నరని ఫైర్
- మహిళా విభాగానికి ‘తెలంగాణ రుద్రమ సేన’గా పేరు మార్పు
ముషీరాబాద్, వెలుగు: మహిళలకు పురుషులతో సమానంగా, కొన్ని విషయాల్లో అంతకంటే ఎక్కువ హక్కులు కల్పించింది రాజ్యాంగమేనని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. వేల ఏండ్లుగా మహిళలను వస్తువులుగా, ఆస్తులుగా చూసిన సమాజంలో వారిని మనుషులుగా గుర్తించింది రాజ్యాంగమేనని చెప్పారు. రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న నవంబర్ 26నే మహిళలకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిన రోజని, ఈ రోజును పండుగలా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. గురువారం సంవిధాన్ దినోత్సవం సందర్భంగా బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘మహిళలు–రాజ్యాంగం’ అంశంపై తెలంగాణ రక్షణ సేన నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. పెళ్లికి ముందు తండ్రి, అన్నల ఆస్తిగా.. పెళ్లయ్యాక భర్త, అత్తింటి వారి ఆస్తిగా మహిళలను చూసేవారని కవిత అన్నారు. మహిళల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా పురుషుల ఆధిపత్యం కొనసాగుతోందన్నారు. ఈ పరిస్థితిని మార్చి మహిళలకూ పురుషులతో సమానంగా ఓటు హక్కు, ఇతర పౌర హక్కులు కల్పించింది రాజ్యాంగమేనని చెప్పారు.
హక్కులున్నా.. అమలులో వివక్షే
రాజ్యాంగం మహిళలకు హక్కులు కల్పించినా వాటిని స్వేచ్ఛగా వినియోగించుకునే పరిస్థితులు లేవని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగం చేసే మహిళ సంపాదనపైనా భర్త, తండ్రి పెత్తనం కొనసాగుతోందన్నారు. కూలీ పని నుంచి సినిమాలు, ఐటీ ఉద్యోగాల వరకు పురుషులతో సమానంగా పనిచేస్తున్నా సమాన వేతనం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కులం, మతంతో సంబంధం లేకుండా వివక్ష కొనసాగుతోందని, దళిత, బీసీ మహిళలకు ఒకరకంగా.. అగ్రకుల మహిళలకు మరోరకంగా వివక్ష ఎదురవుతోందన్నారు.
కమ్యూనిస్టు, మావోయిస్టు పార్టీల్లోనూ వివక్ష
మహిళా హక్కుల కోసం పోరాడతాయని భావించే కమ్యూనిస్టు పార్టీల్లోనూ మహిళలకు ఇబ్బందులు తప్పడం లేదని కవిత విమర్శించారు. మావోయిస్టు పార్టీల్లో మహిళా నక్సలైట్లు కూడా వివక్ష ఎదుర్కొన్నారని అన్నారు. సాయుధ రైతాంగ పోరాటం సహా ఎన్నో ఉద్యమాల్లో పురుషులతో సమానంగా మహిళలు పోరాడినా చరిత్రలో వారికి తగిన గుర్తింపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు తమ చరిత్రను తామే రాసుకోవాలని పిలుపునిచ్చారు.
నాడు సావిత్రిబాయిపై మురికి నీళ్లు.. నేడు మహిళలపై కామెంట్లు
సమాజం కోసం పనిచేయడానికి ముందుకొచ్చే మహిళలను అవమానిస్తున్నారని కవిత అన్నారు. మహిళలకు విద్య అందించేందుకు కృషి చేసిన సావిత్రిబాయి పూలేపై నాడు పెండ, మురికి నీళ్లు చల్లారని.. నేడు రాజకీయాల్లోకి వచ్చే మహిళలపై మురికి కామెంట్లతో దాడి చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలు హక్కుల కోసం ధైర్యంగా ముందుకు రావాలని కోరారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మహిళలు రాణించేందుకు తాను హార్దికంగా, ఆర్థికంగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించేందుకే పార్టీ పెట్టానని తెలిపారు.
మహిళా విభాగానికి ‘తెలంగాణ రుద్రమ సేన’ పేరు
సంవిధాన్ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రక్షణ సేన మహిళా విభాగం పేరును ‘తెలంగాణ రుద్రమ సేన’గా మారుస్తున్నట్లు కవిత ప్రకటించారు. మహిళా నేతలతో కలిసి కొత్త పేరుతో రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. రుద్రమదేవి స్ఫూర్తితో అవసరమైతే కత్తి పట్టి పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రతి మహిళ గల్లీగల్లీ తిరుగుతూ ఇంటింటికీ రాజ్యాంగంపై అవగాహన కల్పించాలని, అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల మహిళా ఇన్చార్జీలు ప్రజల్లోకి వెళ్లి సమస్యలపై పోరాడాలని సూచించారు.
