పదో తరగతి విద్యార్థులకు అలర్ట్: పరీక్షల ఫీజు గడువు పొడిగింపు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..!

పదో తరగతి విద్యార్థులకు అలర్ట్: పరీక్షల ఫీజు గడువు పొడిగింపు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..!

పదో తరగతి విద్యార్థులకు కీలక ప్రకటన చేసింది తెలంగాణ విద్యాశాఖ. 2027 మార్చిలో జరగనున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లింపు గడువు పొడిగించినట్లు తెలిపింది. విద్యార్థులు ఎలాంటి లేట్ ఫీజు లేకుండా డిసెంబర్ 2వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని అధికారులు తెలిపారు.

మొదట నవంబర్ 26 వరకు ఉన్న గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది విద్యాశాఖ. రెగ్యులర్ స్టూడెంట్స్ తో పాటు ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులకు కూడా ఈ సవరణ వర్తిస్తుందని తెలిపారు అధికారులు.. ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించేందుకు వివిధ దశల్లో గడువును పొడిగించినట్లు అధికారులు పేర్కొన్నారు.

పదో తరగతిలో అన్ని సబ్జెక్టులకు కలిపి పరీక్ష ఫీజును రూ.125 గా నిర్ణయించారు. మూడు సబ్జెక్టుల వరకు అయితే రూ.110 చెల్లించాలి. ఒకేషనల్ కోర్సు విద్యార్థులు అదనంగా రూ.60 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ విభాగాలకు చెందిన అర్హులైన విద్యార్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.

హెడ్ మాస్టర్లు అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in ద్వారా స్కూల్ లాగిన్ ఉపయోగించి మాత్రమే ఫీజు చెల్లించాలని అధికారులు స్పష్టం చేశారు. ఐఎఫ్ఎంఎస్ చలాన్లు, బ్యాంకు చలాన్ల ద్వారా చేసే చెల్లింపులను అంగీకరించబోమని తెలిపారు. చివరి తేదీ వరకు వేచి చూడకుండా నిర్ణీత సమయంలోగా ఫీజు చెల్లించాలని విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించారు.