త్రిస్సూర్ లో దారుణం... ఆసుపత్రి టాయిలెట్ లో వృద్ధుడి మృతదేహం...!

త్రిస్సూర్ లో దారుణం... ఆసుపత్రి టాయిలెట్ లో వృద్ధుడి మృతదేహం...!

త్రిస్సూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో లాక్ చేసిన టాయిలెట్‌లో 77 ఏళ్ల వృద్ధుడి మృతదేహం లభించిన ఘటన కలకలం రేపింది. నవంబర్ 21న ఆసుపత్రి టాయిలెట్‌లో మృతదేహాన్ని గుర్తించినట్లు తెలిపారు ఆసుపత్రి సిబ్బంది.ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తున్నారు మృతుడి కుటుంబసభ్యులు. ఈ ఘటనపై సిట్ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది సీపీఐ.

తన తండ్రి గత 12 ఏళ్లుగా గుండె జబ్బుతో బాధపడుతున్నారని చెప్పారు మృతుడి కూతురు. ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన ప్రతిసారీ మళ్లీ అక్కడికే వెళ్తానని ఆయన మొండికేసేవారని... ఆయన త్రిస్సూర్‌లో ఉన్న విషయం పోలీసులు చెప్పే వరకు తమకు తెలియదని అంటున్నారు కుటుంబసభ్యులు.

ఆసుపత్రి యాజమాన్యం సరైన సంరక్షణ అందించలేదని కుమార్తె ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. రావుతర్ అదృశ్యం కావడం, ఆ తర్వాత టాయిలెట్‌లో మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభించడంపై అనుమానాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు.

సిట్ విచారణకు డిమాండ్

ఈ ఘటనపై సిట్ విచారణ జరిపించాలని సీపీఐ డిమాండ్ చేసింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి నిర్లక్ష్యం మళ్లీ జరగకూడదని సీపీఐ ఎమ్మెల్యే కె. రాజన్ అన్నారు. రోగికి ఎవరూ లేరని, ఆయన పేదవాడని ఈ విషయాన్ని తక్కువ చేసి చూడకూడదని రాజన్ పేర్కొన్నారు. సామాన్యులకు ఆశ్రయంగా ఉండాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు జరగడం సరికాదని విమర్శించారు.

ఆసుపత్రిలో సహాయకులు లేని రోగులకు పూర్తి రక్షణ, ఉచిత ఆహారం అందిస్తామని మంత్రి కె. మురళీధరన్ చెప్పారు. మృతదేహం లభించిన టాయిలెట్‌ను గత కొన్ని రోజులుగా శుభ్రం చేశారా లేదా అనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తారని తెలిపారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణం ఎప్పుడు సంభవించిందో తెలుస్తుందని మంత్రి వెల్లడించారు. మృతదేహం లభించడానికి 36 గంటల ముందే ఆయన చనిపోయారా అనే విషయాన్ని నివేదిక ధృవీకరిస్తుందని పేర్కొన్నారు.

కేంద్ర సహాయ మంత్రి సురేష్ గోపి మెడికల్ కాలేజీని సందర్శించారు. చాలా మందిని వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో వదిలేస్తున్నారని, అన్ని అవసరాలను ఆసుపత్రే తీర్చాలని ఆశించడం సరైనది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి వారిని చూసుకోవడానికి స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.