GVK వన్ మాల్‎కు బాంబు బెదిరింపు కాల్.. రంగంలోకి బాంబ్ స్క్వాడ్

GVK వన్ మాల్‎కు బాంబు బెదిరింపు కాల్.. రంగంలోకి బాంబ్ స్క్వాడ్

హైదరాబాద్: బంజారాహిల్స్‎లోని జీవీకే మాల్‎కు బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగుడు మాల్‎లో బాంబ్ ఉన్నట్లు సిబ్బందికి కాల్ చేసి హెచ్చరించాడు. దీంతో మాల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు హుటాహుటిన రంగంలోకి దిగి మాల్ లోపల, బయట, పార్కింగ్ ఏరియాలో క్షుణ్ణంగా సోదాలు చేపట్టారు. 

మాల్‎లోని ఒక్కో అంతస్తు, ఒక్కో షాపులో ముమ్మరంగా గాలించారు. మాల్‎కు వచ్చే వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బాంబు బెదిరింపు నేపథ్యంలో మాల్‎కు వచ్చిన వారు భయాందోళనకు గురయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మాల్ పరిసర ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. 

అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు.  మాల్ ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. తనిఖీల అనంతరం నకిలీ బెదిరింపు కాల్ అని పోలీసులు తేల్చారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బాంబ్ ఉందంటూ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి ఎవరని ఆరా తీస్తున్నారు.