ఆంధ్రా పాలకులు జల దొంగలు ..శ్రీశైలం వెనుక నుంచి రోజుకు 11 టీఎంసీలు ఎత్తుకపోతున్రు : సీఎం రేవంత్

ఆంధ్రా పాలకులు జల దొంగలు ..శ్రీశైలం వెనుక నుంచి రోజుకు 11 టీఎంసీలు ఎత్తుకపోతున్రు : సీఎం రేవంత్
  • కేసీఆర్ పదేండ్ల పాలనలోనే పోతిరెడ్డిపాడు పొక్కను 44 వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచుకున్రు
  • ముచ్చుమర్రి, హంద్రీనీవా, మల్యాల, రాయలసీమ లిఫ్టు పూర్తి చేసిన్రు
  • వాళ్లు కృష్ణా నీళ్లు తరలించుకుపోతుంటే మీరు గాడిదల పండ్లు తోమిండ్రా 
  • గజదొంగ కేసీఆర్​ మా నీళ్లను జగన్ మోహన్​రెడ్డికి తాకట్టు పెట్టిండు
  • కేసీఆర్ ​ప్రాజెక్టులు పూర్తిచేయకపోవడం వల్లే నీళ్లు ఎత్తుకోలేకపోతున్నం
  • ఆంధ్రోళ్లకు మీరు నీళ్లు దోచి పెట్టి ఇప్పుడు నా మీద నిందలేస్తరా?
  • అసెంబ్లీలో చర్చిద్దామంటే మామాఅల్లుళ్లు తప్పించుకుంటుండ్రు
  • ఆరునూరైనా పాలమూరుకు కృష్ణా నీళ్లు..  త్వరలోనే లక్ష ఉద్యోగాల భర్తీ
  • బీజేపీ బిసాత్ ఎంత? ఆ పార్టీ రాష్ట్రంలో ఏ ఊళ్లె ఉంది?
  • బీజేపీ, బీఆర్​ఎస్​ కలిసివస్తే అసెంబ్లీలో లెక్క తేలుస్తా  
  • అచ్చంపేట సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్

 

హైదరాబాద్​/అచ్చంపేట, వెలుగు: పదేండ్ల  బీఆర్ఎస్ పాలనలో ఆంధ్రాపాలకులు జలదొంగల్లాగా శ్రీశైలం నుంచి రోజుకు 11 టీఎంసీలను వెనుక నుంచి వెనుకనే ఎత్తుకుపోయారని, గజదొంగ కేసీఆర్ కృష్ణా నీళ్లను జగన్​రెడ్డికి తాకట్టు పెట్టాడని సీఎం రేవంత్​రెడ్డి ధ్వజమెత్తారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఇందిరమ్మ చీరలు, చేయూత కొత్త పింఛన్ల పంపిణీని సీఎం గురువారం ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. అప్పుడు ఆంధ్రోళ్లకు నీళ్లు దోచిపెట్టి ఇప్పుడు తనపై నిందలు వేస్తున్నారని, దీనిపై అసెంబ్లీలో చర్చిద్దామంటే రాకుండా తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. ఆరునూరైనా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి పాలమూరు జిల్లాను కృష్ణా జలాలతో తడుపుతామని, త్వరలోనే లక్ష ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తామని అచ్చంపేట వేదికగా సీఎం హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కోటి ఓట్లు, 90 సీట్లు గెలిచి తీరుతామన్న సీఎం.. బీజేపీ, బీఆర్ఎస్‌ విడివిడిగా కాకుండా కలిసివస్తే అసెంబ్లీలో రెండు పార్టీల లెక్క తేలుస్తానని సవాల్​విసిరారు. 

పోతిరెడ్డిపాడు పొక్క పెంచుతుంటే ఏం చేసిన్రు.. 

బీఆర్ఎస్ పదేండ్ల పాలనలోనే ఆంధ్రోళ్లు పోతిరెడ్డిపాడు పొక్కను 44 వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచారని, ముచ్చుమర్రి, మల్యాల, రాయలసీమ లిఫ్ట్, హంద్రీనీవా ప్రాజెక్టులను పూర్తి చేశారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ‘వాళ్లు ప్రాజెక్టులు పూర్తిచేసి కృష్ణా నీళ్లు తరలించుకుపోతుంటే మీరు గాడిద పండ్లు తోమిండ్రా..  లేదంటే జగన్ రెడ్డికి గులాంగిరీ చేసిన్రా..’ అని నిలదీశారు. 2015లో కేంద్ర మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగిన భేటీకి చంద్రబాబు, కేసీఆర్, హరీశ్‌రావు, దేవినేని ఉమ కలిసి ఢిల్లీ వెళ్లి తెలంగాణకు మరణ శాసనం రాశారని ఆరోపించారు.  కృష్ణా జలాల్లో ఉన్న 811 టీఎంసీలలో తమకు 299 టీఎంసీలు చాలని, ఆంధ్రాకు 512 టీఎంసీలు ఇచ్చేలా మామా అల్లుళ్లు సంతకం పెట్టి వచ్చారన్నారు. అటు వరద, మిగులు జలాల్లోనూ తెలంగాణకు 34 శాతం, ఆంధ్రాకు 66 శాతం వాటాకు అంగీకరించి రాష్ట్ర ప్రజల హక్కులను శాశ్వతంగా ఆంధ్రోళ్లకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు.


చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్లు కేసీఆర్ తాగితే, వైఎస్సార్ మోచేతి నీళ్లు హరీశ్‌‌రావు తాగాడని సీఎం విమర్శించారు. వార్డు మెంబర్ కూడా కాని హరీశ్‌‌రావుకు నిజమైన గురువు కేసీఆర్ కాదని, 2004లో మొదట మంత్రిని, తర్వాత ఎమ్మెల్యేను చేసింది వైఎస్సారేనని.. అందుకే మామనైనా ప్రైవేట్‌‌గా తిడతడు కానీ మంత్రిని చేసిన వైఎస్సార్‌‌ను, వైఎస్ జగన్‌‌ను హరీశ్ పల్లెత్తు మాట అనరని చెప్పారు. వైఎస్సార్ విసిరిన ఎంగిలి మెతుకులు, రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసు తిని బలిసి, రాయలసీమను రతనాల సీమ చేస్తానంటూ పాలమూరును ఎడారిగా మార్చారని మండిపడ్డారు. పాలమూరు ప్రజలు ఐదేండ్లు ఎంపీగా అన్నం పెట్టి గుండెల్లో పెట్టి భుజాలపై మోసినా ఒక్కరోజైనా కడుపు నింపాలని చూడలేదన్నారు. పదేండ్లలో ఎస్ఎల్‌‌బీసీ (నల్లగొండ ఫ్లోరైడ్), కల్వకుర్తి, కోయిల్‌‌సాగర్, భీమా, నెట్టెంపాడు, పాలమూరు–రంగారెడ్డి, డిండి, అచ్చంపేట లిఫ్ట్ ప్రాజెక్టులు పూర్తి చేసుంటే రోజుకు 3 టీఎంసీలు ఎత్తి లక్షలాది ఎకరాలు పండి మా బతుకులు మారేవని చెప్పారు. కేసీఆర్ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్లే ఇవాళ నీళ్లు ఎత్తుకోలేకపోతున్నామని, లక్షల కోట్లు ఖర్చు పెట్టి వేల కోట్ల కమీషన్లు మెక్కి పాలమూరు పాలిట ‘పాపాల భైరవుడిలా, శనిలాగా’ మారారని, తనలో ఉన్నది ‘దోఖేబాజ్ ద్రోహి’ రక్తం కాదని, నికార్సైన తెలంగాణ, పాలమూరు బిడ్డల పౌరుషమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

అధికారం పోయిందని ఫామ్​హౌస్​ల పన్నడు..

34 నెలల నుంచి అసెంబ్లీకి రాకుండా, ప్రజల్లోకి వెళ్లకుండా దాదాపు రూ.2 కోట్ల జీతభత్యాలు, 300 మంది పోలీసుల రక్షణ అనుభవిస్తున్న కేసీఆర్‌‌ను ఎలా శిక్షించాలో ప్రజలే చెప్పాలని రేవంత్ అన్నారు.  డ్యూటీకి సంతకం పెట్టి ఒక్క గంట సహచరుడి పుట్టినరోజు పార్టీకి, ఫామ్‌‌హౌస్‌కు వెళ్లిన పోలీసులను అధికారులు సస్పెండ్, డిస్మిస్ చేశారని.. మరి 34 నెలలుగా విధులకు రాని కేసీఆర్ సంగతేంటని ప్రశ్నించారు. 2001లో పుట్టి, కాంగ్రెస్ పంచన రెండుసార్లు, సొంతంగా రెండుసార్లు అధికారం అనుభవించిన బీఆర్ఎస్.. అధికారం పోగానే ప్రజల్లోకి రాక ముఖం చెల్లక ‘ఫామ్‌‌హౌస్ ఎత్తిపోతల పథకం’లో ఉందని ఎద్దేవా చేశారు. కల్వకుర్తి, పాలమూరు, ప్రాణహిత ఎత్తిపోతలు తెస్తారనుకుంటే కేసీఆర్ ‘ఫుల్, హాఫ్, క్వార్టర్ ఎత్తుడు, పోసుడు’ అనుకున్నాడని, అధికారంలో ఉంటే రాష్ట్రాన్ని దోచి కొడుకు, అల్లుడు, బిడ్డకు పంచిపెట్టడం, అధికారం పోతే ఫామ్‌‌హౌస్‌లో పడుకోవడమే ఆయన నైజమని విమర్శించారు.

హరీశ్​ ఎక్కడా కమిషన్లు వదల్లేదు..

హరీశ్‌‌రావును మొదట ఆర్థిక, తర్వాత సాగునీటి, అనంతరం ఆరోగ్య శాఖ మంత్రిగా చేస్తే కరోనాలో కూడా కమీషన్లు వదలలేదని సీఎం ఆరోపించారు. ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టుల శాఖ తనకివ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగుతుంటే.. ‘దండం పెడతా నీ కాళ్లు పట్టుకుంటా ఆయనకు మాత్రం ఇయ్యకు, పాత కమీషన్లు కావాలని రోజూ తిప్పలు పెడుతున్నాడు’ అని కాంట్రాక్టర్లే తనతో అన్నారని చెప్పారు. నిజాలు చెప్పినా, కమీషన్లు మానేసినా నీ తల వెయ్యి ముక్కలై చస్తావని సలేశ్వరం దేవుడు తలమీద శాపం పెట్టడం వల్లే వాళ్లు నోరు తెరిస్తే ఎన్నడూ నిజం చెప్పరు, కమీషన్లు మానరు అని విమర్శించారు. ఈ సందర్భంగా త్రిలింగ దేశపు రాజు చంద్రశేఖరుడు, ఆయన అల్లుడు కథ ద్వారా హరీశ్‌‌రావుపై సీఎం వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  

రాబోయే ఏడాదిలో మరో 25 వేల ఉద్యోగాలు

గ్రూప్–1లో 112 మంది డీఎస్పీలు, 562 మంది ఆర్డీవోలు, గ్రూప్–2, 3, 4, టీచర్లు, కానిస్టేబుళ్లు, పారామెడికల్ సిబ్బంది కలిపి ఇప్పటివరకు 75 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని సీఎం తెలిపారు. ఉపాధి హామీ కూలీలు రూపాయి రూపాయి కూడబెట్టి పీజీలు, పీహెచ్‌‌డీలు చదివించిన ఓయూ యువకులు ఊరికి రాలేక, పెండ్లి చేసుకోలేక, తల్లిదండ్రుల భారం మోయలేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకోని ఆ సన్నాసులు తన కాలి గోటితో కూడా సమానం కాదన్నారు. హరీశ్‌‌రావు రూ. 100 పెట్రోల్ తెచ్చుకున్నాడు కానీ 10 పైసల అగ్గిపెట్టె దొరకక మంత్రి అయ్యాడని, అగ్గిపెట్టె దొరికిన శ్రీకాంతాచారి అమరుడయ్యాడని.. పదేండ్లలో ఒక్కరోజైనా ‘ఎట్లున్నావు శంకరమ్మా’ అని ఆ తల్లిని అడిగిన పాపాన పోలేదని మండిపడ్డారు. కేసీఆర్‌‌కు తెలంగాణ సంక్షేమమంటే నలుగురేనని (హరీశ్, కేటీఆర్, కవిత, సంతోష్), ఎర్రబెల్లి దయాకర్ రావు, కూకట్‌‌పల్లి కృష్ణారావు తప్ప ప్రజలు పట్టరన్నారు. రాబోయే ఏడాదిలో మరో 25 వేల ఉద్యోగాలు, 7,500 పోలీస్, 2,000 హోంగార్డు తదితర నోటిఫికేషన్లు  భర్తీ చేస్తామన్నారు.

ఏ రాష్ట్రంలో లేని విధంగా గిగ్​వర్కర్ల పాలసీ.. 

1930లో బ్రిటిష్ పాలనలో జరిగిన తర్వాత వందేండ్లుగా, స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏండ్లలోనూ జరగని కులగణనను తాము చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలో కోడికి, కుందేలుకు, మేకకు, అడవిలో పులులకు కూడా లెక్క ఉంది కానీ.. బీసీ బిడ్డలకు లెక్క లేదని, అసలు వారిని లెక్కే చేయలేదని విమర్శించారు. తొలిసారిగా జనాభాలో బలహీనవర్గాలు, దళితులు, మైనార్టీలు, మహిళలు ఎంతమంది ఉన్నారో, వారి జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయో లెక్కించి దేశానికే ఆదర్శంగా నిలిచి ప్రధాని మోదీకి సవాల్ విసిరామన్నారు. దేశంలో మరే ముఖ్యమంత్రి చేయని విధంగా గిగ్ వర్కర్ల పాలసీని తెచ్చామన్నారు. అలాగే 35 ఏండ్లుగా పోరాడి వేలు, లక్షల మంది కేసులపాలై, ప్రాణాలు కోల్పోయి దళితుల మధ్య చిచ్చుకు కారణమైన ఎస్సీ ఉపకులాల వర్గీకరణ సమస్యను అందరినీ ఒప్పించి దేశంలోనే తొలిసారిగా తానే పూర్తి చేశానని, నేడు మాదిగ, మాదిగ ఉపకులాలతో సహా దళిత బిడ్డలందరూ సఖ్యతతో ముందుకు వెళ్తున్నారన్నారు.
గ్రామగ్రామానా చర్చ పెట్టండి.. 
1983 నుంచి 2023 వరకు నాలుగు దశాబ్దాలు, మూడు తరాలు (ఎన్టీఆర్ తరం, వైఎస్సార్ తరం, కేసీఆర్ తరం)లో ఇచ్చిన బట్టలు, ఉచిత కరెంట్, ఆరోగ్యశ్రీ, షాదీ ముబారక్, రైతుబంధు సహా అన్ని పథకాలనూ కొనసాగిస్తూనే.. అదనంగా రేషన్ కార్డులు, సన్న బియ్యం, 8 లక్షల ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత కరెంట్, ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా, సన్నవడ్లకు రూ. 500 బోనస్ ఇచ్చామని, చెప్పుకుంటూ పోతే రాస్తే రామాయణం, చెబితే మహాభారతమని, తెల్లారేదాకా చెప్పే శక్తి ఉందని సీఎం పేర్కొన్నారు. తాను 34 నెలలు, 365 రోజులు, 24 గంటలు ప్రతిక్షణం పేద ప్రజల మధ్యే ఉంటూ కార్యకర్తలకు అండగా నిలబడ్డానని, ఇంతగా కార్యకర్తల మధ్య ఉన్న సీఎం ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. పెళ్లికి, దావత్‌‌కు, చావుకు, కల్లు కాంపౌండ్‌‌కు, బార్ షాప్, బీర్ షాప్ కాడికి ఎక్కడికి పోయినా పదేండ్లు వాళ్లేం చేశారు, మూడేండ్లు మనమేం చేశామో కార్యకర్తలు గ్రామగ్రామాన చర్చ పెట్టాలని పిలుపునిచ్చారు. పదేండ్లలో చంద్రశేఖరరావు ఎన్నడైనా పేదోళ్లకు ఈ పథకాలు, ఉద్యోగాలు ఇచ్చాడా అని మీడియా మిత్రులు రాయాలని, ఏమిచ్చాడని మళ్లీ అధికారంలోకి వస్తా అంటున్నాడో నిలదీయాలన్నారు.

అందినకాడల్లా అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించిన్రు..

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా సీఎం గణాంకాలతో ఆరోపణలు చేశారు. 2014లో సోనియా గాంధీ ధనిక రాష్ట్రాన్ని, రూ. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌‌తో పాటు 60 ఏండ్లలో 16 మంది ముఖ్యమంత్రులు చేసిన రూ. 70 వేల కోట్ల అప్పుతో తెలంగాణను కేసీఆర్ చేతిలో పెట్టారని గుర్తుచేశారు. కానీ ఒక్క కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబం కలిసి పదేండ్లలో ఏకంగా రూ. 8 లక్షల 11 వేల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆరోపించారు. రాష్ట్రం రూ. 8 లక్షల 11 వేల కోట్ల అప్పుల కుప్పై అప్పులపాలైతే, కేసీఆర్ మాత్రం నిజాము కంటే ఆగర్భ శ్రీమంతుడయ్యాడని.. నిజాంకు 220 ఏండ్లు పడితే కేసీఆర్‌‌కు పదేండ్లే పట్టిందని, రాష్ట్రాన్ని పట్టి పీడించి చెదలు పట్టించి విధ్వంసం చేసి ఆ కుటుంబం ఒక్కటే బాగుపడిందని విమర్శించారు.  

పొడతూర్పు గిత్త నా ప్రాంతం..

అచ్చంపేటను దత్తత తీసుకోవాలంటూ ఎంపీ డాక్టర్ వంశీకృష్ణ చేసిన ప్రతిపాదనపై సీఎం స్పందిస్తూ.. ‘నేనే ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డను.. ఈ నల్లమల, ఈ అచ్చంపేట, ఈ పొడతూర్పు గిత్త నా ప్రాంతం’ అని అన్నారు. తన సర్వం ఒడ్డి, రక్తాన్ని చెమటగా మార్చి ఈ ప్రాంతాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యత తనదని ప్రకటించారు. ఉమామహేశ్వరం, మద్దిమడుగు ఆంజనేయుడు, తెలంగాణ అమర్‌‌నాథ్ సలేశ్వరం లింగమయ్య కొలువైన ఈ నేలపై శాతవాహనులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, కందూరు చోళులు, కాకతీయులు, రేచర్ల రెడ్డి నాయకులు, బహమనీ, కుతుబ్‌‌షాహీ, నిజాంలు పాలించారని, చెంచు గిరిజనులకు ఈ నల్లమల ఆలవాలమని గుర్తుచేశారు. 14వ శతాబ్దంలో అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాధిపతి మాలిక్ కాఫిర్‌‌ను ఎదిరించి గెలిచిన దక్షిణ భారత ఝాన్సీ లక్ష్మీరాణి వీరవనిత అచ్చమాంబ పేరుతోనే అచ్చంపేట పట్టణం ఏర్పడిందని, ఆనాటి రాణి అచ్చమాంబ తరహాలోనే దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ స్ఫూర్తితో తమ ప్రజా ప్రభుత్వం మూడేండ్లుగా పాలన సాగిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు

 అచ్చంపేట వేదికగా కోటి మంది ఆడబిడ్డలకు చిలకపచ్చ చీరలు..

మహిళా సంఘాలను గతంలో కేసీఆర్ కనీసం పిలిచి మాట్లాడలేదని, తమ ప్రభుత్వంలో మంత్రి సీతక్క ఆధ్వర్యంలో రూ. 79 వేల కోట్ల బ్యాంకు లింకేజీ, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం (ఆర్టీసీకి రూ. 13 వేల కోట్ల చెల్లింపు), మహిళలకు వెయ్యి బస్సులు, 1,000 మెగావాట్ల సోలార్ పవర్, పెట్రోల్ బంకులు, ఇందిరమ్మ క్యాంటీన్లు, హైటెక్ సిటీ పక్కన రూ. 1,000 కోట్ల ఆస్తిలో 150 షాపులు ఇచ్చి అంతర్జాతీయ స్థాయిలో ఉత్పత్తులు అమ్ముకునేలా చేశామని సీఎం తెలిపారు. గతేడాది పాలపిట్ట చీరలు, ఈసారి అచ్చంపేట వేదికగా చిలకపచ్చ ఇందిరమ్మ చీరలను కోటి మంది ఆడబిడ్డలకు అన్నగా సారె పెడుతున్నామన్నారు.

గతంలో బతుకమ్మ చీరలను సూరత్ నుంచి కిలోల లెక్కన తూకంలో తెచ్చి కమీషన్లు కొట్టారని, వాటిని పొలాల్లో అడవి పందులను బెదిరించడానికే కట్టారని, ఆ ఆడబిడ్డల ఉసురు తగిలే 2023లో కుప్పకూలి నడుము విరిగి దావఖానలో చేరినా ఇంకా సిగ్గు రాలేదా అని సీఎం విమర్శించారు. ‘ఒకవైపు చెల్లెలకు ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తదని, పుట్టింటికొస్తే బుక్కెడు బువ్వ పెట్టాల్సి వస్తదని సొంత చెల్లెల్నే మెడలు పట్టి బయటకు గెంటిన ద్రోహి ఉంటే.. కోటి మందిని సొంత ఆడబిడ్డల్లా చూసుకునే మీ రేవంతన్న ఇక్కడున్నాడు, పులికి గుంట నక్కకున్నంత తేడా ఉంది’ అని దుయ్యబట్టారు. ఆడబిడ్డలు నిండు మనసుతో ఆశీర్వదిస్తే కొండనైనా బద్దలు కొట్టి వారిని కోటీశ్వరులను చేసే బాధ్యత తనదని చెప్పారు.

ఒక్క కల్వకుంట్ల కుటుంబమే బాగుపడ్డది.. 

 కేసీఆర్, హరీశ్‌‌రావు, కేటీఆర్, కవిత, సంతోష్ రావు కలిసి పదేండ్లలో లక్ష కోట్ల రూపాయల ఆస్తులు పోగేసుకున్నారని, వాళ్లకు ఫామ్‌‌హౌస్‌‌లు, టీవీలు, పేపర్లు, వ్యాపారాలు, ఫైవ్ స్టార్ హోటళ్లు ఉన్నాయని, సారా, పాలు, నీళ్లు, గంజాయి, గుడుంబా సహా ప్రతి వ్యాపారం వాళ్లదేనని సీఎం ఆరోపించారు. కానీ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆర్థిక పరిస్థితి ఎట్లుందో ఆలోచించాలని కోరారు. ఇటీవల ఓ తెలంగాణ ఉద్యమకారుడు అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటే పొన్నం ప్రభాకర్‌‌ను పంపించి ఆ కుటుంబాన్ని ఆదుకున్నామని, వేదికపై ఉన్న రాజేందర్ లాంటి ఉద్యమకారులు, కేసీఆర్‌‌తో పనిచేసిన వారు, అమరవీరుల కుటుంబాలు, విద్యార్థుల పరిస్థితి చూడాలని సూచించారు.

తెలంగాణలో బీజేపీ బిసాత్ ఎంత?

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణకు వచ్చి తన గురించి మాట్లాడటంపై సీఎం మండిపడ్డారు. బిహార్‌లో సొంత అసెంబ్లీ స్థానాన్ని కూడా గెలవలేని ఆయన వచ్చి తనకు నీతులు చెబుతున్నాడని విమర్శించారు. 'లావు మొనగాడు లడాయికి పోతే వెనుక ముగ్గురు నూకుడు మొనగాళ్లు అయ్యారన్నట్లు'.. బండి సంజయ్, రామచందర్ రావు, కిషన్ రెడ్డి వెనుక ఉండి ఆయన్ను నూకుతున్నారని, ఎంత నూకినా 'ఊరు కాలేది లేదు, పీరు లేసేది లేదు' అని సీఎం ఎద్దేవా చేశారు. ‘రాష్ట్రంలో ఎక్కడుంది బీజేపీ.. ఏ ఊర్లో ఉంది.. ఎంతమంది వార్డు మెంబర్లు, సర్పంచులు, మున్సిపల్ స్థానాలు గెలిచారు.. మీ లెక్కెంత, మీ బిసాత్ ఎంత?’ అని ప్రశ్నించారు. తమ మీటింగ్ వద్ద పల్లీ బఠానీలు, చాయ్ బిస్కెట్లు అమ్ముకునేంత మంది కూడా బీజేపీలో లేరని, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావడం కాదు కదా అక్కడ పల్లీ బఠానీలు, చాయ్ బిస్కెట్లు అమ్ముకోవడం తప్ప చేయగలిగిన పనేమీ లేదని విమర్శించారు.