- కృష్ణా బోర్డుకూ చెప్పకుండా ఏకపక్షంగానే గేట్లు ఎత్తుకున్న ఏపీ
- దీంతో ఎడమ కాల్వకూ 2500 క్యూసెక్కులు రిలీజ్ స్టార్ట్ చేసిన తెలంగాణ
- బోర్డు మీటింగ్ పెట్టాలని కృష్ణా బోర్డు చైర్మన్‌కు మెంబర్ సెక్రటరీ లేఖ
హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం మరోసారి భగ్గుమంది. సాగర్ ప్రాజెక్టుపై పొరుగు రాష్ట్రం దౌర్జన్యానికి దిగింది. కుడి కాల్వ నుంచి అక్రమంగా నీటిని విడుదల చేసుకున్నది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) అనుమతులు లేకుండానే, బోర్డుకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాగార్జునసాగర్ కుడి కాలువ గేట్లను ఎత్తడం వివాదాస్పదమైంది.
తాగునీటి అవసరాల పేరుతో గురువారం ఉదయం కుడి కాల్వకు 2,500 క్యూసెక్కుల నీటిని ఏపీ అధికారులు విడుదల చేశారు. ఏపీ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించి ఏకపక్షంగా నీటిని తరలించుకుపోతున్న విషయాన్ని తెలంగాణ అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. సమాచారం లేకుండా నీళ్లెట్లా తీసుకెళ్తారంటూ ఏపీ అధికారులను నిలదీశారు. వాళ్లు వినకపోవడంతో సర్కారు ఆదేశాల మేరకు ఏపీ చర్యకు కౌంటర్‌గా తెలంగాణ అధికారులు సాగర్ ఎడమ కాలువ ద్వారా 2,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నీటితో అడవి దేవులపల్లి, పాలేరు రిజర్వాయర్లను నింపుతున్నారు.
మన వేసవి అవసరాలు తీరకుండా..
ఎండాకాలం వరకు తాగునీటి అవసరాలను తీర్చుకునేందుకు ప్రస్తుతం తెలంగాణకు ఉన్న ఏకైక సోర్సు నాగార్జునసాగర్. ముఖ్యంగా హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు తాగునీటిని సరఫరా చేయాల్సి ఉంది. ఎల్‌నినో నేపథ్యంలో సాగర్ నుంచే మన రాష్ట్రం నీటిని డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ, ఏపీ మాత్రం మన నీళ్లకు ఎసరు పెడుతున్నది. మూడు రోజుల క్రితం జరిగిన త్రీమెంబర్ కమిటీ మీటింగ్‌లో ఏపీ కృష్ణా డెల్టాకు 10 టీఎంసీల నీళ్లు కావాలని అడిగింది. తెలంగాణ మాత్రం ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. అవన్నీ తమ నీళ్లని, తమకూ అవసరాలున్నాయని స్పష్టం చేసింది. కానీ ఏపీ మాత్రం కేడీఎస్‌కు నీళ్లు తరలింపు తన హక్కు అని చెబుతూనే.. తాజాగా కుడి కాల్వ నుంచి అక్రమంగా నీళ్లను వదులుకున్నది. ఇప్పటికే పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై గొడవ జరుగుతున్న సంగతి తెలిసిందే.
అటువైపు మనోళ్లను రానివ్వకుండా..
కామన్ రిజర్వాయర్లైన నాగార్జునసాగర్‌కు తెలంగాణను, శ్రీశైలానికి ఏపీని ఓనర్లుగా ప్రకటించారు. ఈ క్రమంలో శ్రీశైలం మొత్తాన్ని తన కంట్రోల్లో పెట్టుకున్న ఏపీ.. సాగర్‌ను మాత్రం మన అధీనంలో లేకుండా చేసింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏపీ అధికారులు సాగర్ కుడివైపు భాగాన్ని ఆక్రమించుకున్నారు. కావాల్సినప్పుడల్లా కుడి కాల్వ గేట్లను వాళ్లే ఎత్తుకుంటున్నారు. మన అధీనంలో ఉండాల్సిన ప్రాజెక్టును మనకు కాకుండా చేసి.. వాళ్లు ఆక్రమించిన వైపు మనల్ని కనీసం రానివ్వడం లేదు. ఎన్ని సార్లు ఏపీపై ఫిర్యాదు చేసినా.. కృష్ణా బోర్డుగానీ, కేంద్ర ప్రభుత్వంగానీ ఆ రాష్ట్రంపై చర్యలు తీసుకున్న పాపాన పోలేదు.
వెంటనే బోర్డు భేటీకి మెంబర్ సెక్రటరీ లేఖ
ఒకవైపు ప్రాజెక్టులో నీటి నిల్వలు అడుగంటిపోతుంటే, మరోవైపు బోర్డు అనుమతి లేకుండానే ఇరు రాష్ట్రాలు పోటాపోటీగా కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేస్తుండటంతో పరిస్థితి తీవ్రంగా మారింది. ఈ నేపథ్యంలోనే కృష్ణా బోర్డు పూర్తిస్థాయి మీటింగ్‌ను నిర్వహించాల్సిందిగా బోర్డు చైర్మన్ శుభ్రాంగ్షు బిశ్వాస్కు మెంబర్ సెక్రటరీ సతీశ్ కాంబోజ్ తాజాగా లేఖ రాశారు. ఈ నెల 23న నిర్వహించిన త్రీమెంబర్ కమిటీ మీటింగ్‌లో ఏమీ తేలలేదని చెప్పారు. కాబట్టి వీలైనంత త్వరగా బోర్డు మీటింగ్నిర్వహించాలని చైర్మన్‌ను కోరారు.
