Mohammed Shami: 2027 వన్డే వరల్డ్ కప్, 2028 టీ20 వరల్డ్ కప్‌లలో ఆడటంపై టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తు టోర్నీల గురించి దూరదృష్టితో ఆలోచించడం కంటే, ప్రస్తుతం ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం, బౌలింగ్ రిథమ్‌లో కొనసాగడమే తన ముందున్న లక్ష్యమని స్పష్టం చేశాడు. ఇటీవలే టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన 35 ఏళ్ల షమీ, గురువారం ముంబైలో మీడియాతో మాట్లాడుతూ సెలక్షన్ నిర్ణయాలను సెలెక్టర్లకే వదిలేస్తున్నట్లు తెలిపాడు.
ఆ లెక్కలన్నీ ఆపేశా.. నా ఫోకస్ అంతా నా ఆటపైనే:
వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్, 2028 టీ20 వరల్డ్ కప్ అవకాశాలపై షమీ మాట్లాడుతూ.. నేను అవన్నీ లెక్కపెట్టడం ఎప్పుడో ఆపేశాను.. ఇప్పుడు నా ఫోకస్ అంతా నా ఆటపైనే ఉంది.. సెలెక్టర్లు ఏ నిర్ణయం తీసుకున్నా అది మంచిదే అవుతుంది.. నా వైపు నుంచి చేయాల్సిందల్లా బౌలింగ్ రిథమ్‌లో ఉండటం, కనీసం రాష్ట్ర జట్టుకు, ఐపీఎల్‌కు ఆడుతూ కొనసాగడమేనని షమీ పేర్కొన్నాడు.
యువకులకు అనుభవం పంచడమే నా మోటివేషన్: క్రికెట్‌ను ఇష్టపడినంత కాలం, ఆటను ఆస్వాదించినంత కాలం ఆడుతూనే ఉండాలి.. దేశవాళీ క్రికెట్‌లో నా అనుభవం నుంచి కుర్రాళ్లు ఏదైనా నేర్చుకుంటారనే ఆశతోనే ఆడుతున్నాను.. ఏ స్థాయిలో ఆడుతున్నామన్నది ముఖ్యం కాదు, యువ ఆటగాళ్లకు మన అనుభవాన్ని బదిలీ చేయాలని తెలిపాడు.
రిటైర్మెంట్ వార్తలకు చెక్.. వైట్-బాల్ బిందాస్‌గా ఆడుతా:
దేశవాళీ క్రికెట్ ఆడటం పూర్తిస్థాయి రిటైర్మెంట్‌కు సంకేతమన్న ప్రచారాన్ని బెంగాల్ పేసర్ షమీ ఖండించాడు. దీనికి రిటైర్మెంట్‌తో ఎలాంటి సంబంధం లేదు.. నేను ఇప్పటికే చెప్పాను.. వైట్-బాల్ క్రికెట్ కొనసాగిస్తాను.. అవసరమైతే ఫిట్‌నెస్ కోసం రెడ్-బాల్ క్రికెట్ కూడా ఆడుతాను.. గత 15–20 ఏళ్లుగా నేను చేస్తున్న రొటీనే ఇది, కొత్తేమీ కాదన్నాడు.
టెస్ట్ రిటైర్మెంట్ ఎందుకంటే?: సుదీర్ఘ ఫార్మాట్‌లో శరీరంపై ఎక్కువ భారం పడుతోంది. అందుకే టెస్టుల నుంచి తప్పుకోవడం సరైన నిర్ణయమనిపించింది. ఇప్పుడు బాగా కదులుతున్నాను, బాగా ఆడుతున్నాను.. కాబట్టి ఇకపై బిందాస్ గా వైట్-బాల్ క్రికెట్ ఆడుతానని షమీ చెప్పుకొచ్చాడు.
