హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి దంచికొడుతున్న వర్షం.. 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్!

 హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి దంచికొడుతున్న వర్షం.. 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్!

హైదరాబాద్ నగరాన్ని అర్ధరాత్రి భారీ వర్షం ముంచెత్తింది. నవంబర్ 27 (శుక్రవారం) తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ప్రారంభమైన వర్షం పలు ప్రాంతాల్లో రెండు నుంచి మూడు గంటల పాటు కుండపోతగా కురిసింది. దీంతో నగరంలోని రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోగా.. పలుచోట్ల డ్రైనేజీలు, నాలాలు పొంగిపొర్లాయి.

మేడ్చల్ జిల్లా కీసరతో పాటు బోడుప్పల్, పీర్జాదిగూడ, ఉప్పల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లోనూ వాన దంచికొట్టింది. మోండా మార్కెట్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, క్లాక్ టవర్, మారేడుపల్లి, బోయిన్‌పల్లి, రాణిగంజ్, ఎంజీ రోడ్, ఆర్పీ రోడ్, బేగంపేట ప్రాంతాలు వర్షానికి తడిసిముద్దయ్యాయి.

మరోవైపు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట, యూసుఫ్‌గూడ, ఎర్రగడ్డ, బోరబండ ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి రహదారులు చెరువులను తలపించాయి. రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

తెల్లవారుజామున 4.30 గంటల తర్వాత వర్షం కాస్త తగ్గుముఖం పట్టింది. ఆ తర్వాత కూడా పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కొనసాగాయి. అర్ధరాత్రి కురిసిన వర్షంతో నగర వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

 ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్ 

రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సంగారెడ్డి, మెదక్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.