- రాహుల్ ‘సర్’ను వ్యతిరేకిస్తుంటే.. రేవంత్ యంత్రాంగంతో
- అమలు చేయిస్తున్నరు కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్
- కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజ్యాంగ ద్రోహులే: బండి సంజయ్
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో గెలిస్తే ఈవీఎంలు బాగున్నాయని, ఓడిపోతే ఎన్నికల కమిషన్ శత్రువని కాంగ్రెస్ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి తీరు ‘బొమ్మ పడినా నాదే, బొరుసు పడినా నాదే’ అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. గురువారం హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బీజేపీ తెలంగాణ సంవిధాన్ గౌరవ దివస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భారత రాజ్యాంగ గౌరవ దినోత్సవం’పై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఈవీఎం ట్యాంపరింగ్, ఓటు చోరీ అంటూ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే కేరళ, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో కాంగ్రెస్ ఎలా అధికారంలోకి వచ్చిందని, రాహుల్, ప్రియాంక గాంధీ ఎంపీలుగా ఎలా గెలిచారని ప్రశ్నించారు. విదేశాల్లో భారత ప్రజలను, రాజ్యాంగాన్ని, ఈసీని రాహుల్ అవమానిస్తున్నారని విమర్శించారు.
రేవంత్ రోడ్లపైకి వచ్చారు కానీ చేతిలో త్రివర్ణ పతాకం లేదని, జాతీయ జెండా పట్టుకోవడానికి కాంగ్రెస్ నేతలు సిగ్గుపడుతున్నారని వ్యాఖ్యానించారు. రాహుల్ లాగే రేవంత్ కూడా గందరగోళంలో ఉన్నారని, చెప్పేది ఒకటి చేసేది మరొకటనిపేర్కొన్నారు. ‘‘2025 జనవరిలో జరిగిన సభలో బీజేపీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందని రేవంత్ అన్నారు. కానీ సవరణలు చేసి, ఎమర్జెన్సీ విధించి, రాజ్యాంగ హత్య దివస్ జరుపుకుంటూ అపహాస్యం చేస్తున్నది కాంగ్రెసే. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఢిల్లీలో ఈసీని సైమన్ కమిషన్‌తో పోల్చిన రేవంత్.. అదే వేదికపై నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించే అధికారం ఈసీకి ఉందని చెప్పారు”అని వివరించారు. రాహుల్ సర్‌ను వ్యతిరేకిస్తుంటే, తెలంగాణలో ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా నిమగ్నం చేసి రేవంత్ సర్ అమలు చేస్తున్నారని, స్వయంగా ఈసీకి లేఖ రాసి గడువు పెంచాలని, మార్పులు చేయాలని కోరారని వెల్లడించారు.
మోదీ ప్రధాని అయ్యాకే రాజ్యాంగ దినోత్సవం: బండి సంజయ్
ఎమర్జెన్సీతో రాజ్యాంగాన్ని కాలరాసి, సిక్కులను ఊచకోత కోసిన కాంగ్రెస్ నేతలు రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ నిర్వహించడం.. సంపినోడే కోర్టు ముందు హాజరై అమాయకుడినని ఫోజు పెట్టినట్లుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. అంబేద్కర్‌ను ఓడించడమే కాకుండా, ఆయన మరణిస్తే అంత్యక్రియలు చేయకుండా కాంగ్రెస్ అవమానించిందని ఆరోపించారు. మరోవైపు అంబేద్కర్ జయంతి, వర్ధంతికి రాకుండా, ఆయన రాజ్యాంగాన్ని చించివేసి కొత్త రాజ్యాంగం తేవాలంటూ మాట్లాడి, గవర్నర్‌కు ప్రోటోకాల్ ఇవ్వకుండా కేసీఆర్ అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ముమ్మాటికీ రాజ్యాంగ ద్రోహులేనన్నారు. మోదీ ప్రధాని అయ్యాకే రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, రాజ్యాంగ ఫలాలను సామాన్యులకు అందిస్తున్నారని చెప్పారు. డబ్బున్నోళ్లకు, ఉన్నత వర్గాలకే ఓటు హక్కుండాలని నెహ్రూనే రాజాజీ చేత చెప్పించారని గుర్తుచేశారు. ‘‘ఓట్ల తొలగింపుపై సీఎం వ్యాఖ్యలు పచ్చి అబద్ధం. అధికార యంత్రాంగం మీ ఆధీనంలోనే పనిచేస్తున్నప్పుడు బీఎల్ఏలతో ఓట్లు ఎందుకు కల్పించలేకపోయారు? దమ్ముంటే తొలగించిన ఓట్ల ఆధారాలను బయటపెట్టాలి’’ అని ఆయన సవాల్ విసిరారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ అడ్డుపడింది: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
ప్రధాని మోదీ 2015లో అంబేద్కర్‌తో అనుబంధం ఉన్న ఐదు ప్రాంతాలను ‘పంచతీర్థ్’గా అభివృద్ధి చేశారని, ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించింది బీజేపీ ప్రభుత్వమేనని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గుర్తుచేశారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుతోనే గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తన పదవిని కాపాడుకునేందుకు ఓట్ చోరీ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ‘నారీ శక్తి వందన్ బిల్లు’కు కాంగ్రెస్ అడ్డుపడిందని పేర్కొన్నారు. ఆర్టికల్ 300ఏ ప్రకారం ఆస్తి హక్కు ఉన్నప్పటికీ తెలంగాణలో ప్రజల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం లాక్కుంటోందని, భూ కుంభకోణాలపై సమాధానం చెప్పకుండా ర్యాలీలు నిర్వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గువ్వల బాలరాజు, సీతారాంనాయక్, విజయరామరావు, అశోక్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ఓటమి భయంతోనే చోరీగా సర్ చిత్రీకరణ: రాంచందర్ రావు
రాజ్యాంగ దినోత్సవానికి 2015లో ప్రధాని మోదీనే అధికారిక గుర్తింపు కల్పించారని, ఇన్నేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎందుకు ఆలోచించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ప్రశ్నించారు. సర్ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో పనిచేసే బీఎల్వోలు, ఈఆర్వోలు రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందేనని, ఇందులో కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణలో 73 లక్షల ఓట్లు తొలగించారంటున్న కాంగ్రెస్.. సర్ గడువు పొడిగించిన తర్వాత తమ పేర్లు చేర్చాలని సీఈవో కార్యాలయానికి కేవలం 1,000 దరఖాస్తులే ఎందుకు వచ్చాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి భయంతోనే సర్‌ను ఓట్ చోరీగా చిత్రీకరించి, ఇప్పుడే సాకులు వెతుక్కుంటున్నారని విమర్శించారు.
