- కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ క్షేత్రస్థాయి నివేదికలో వెల్లడి
- రెండు నెలల్లో ఆత్మహత్య చేసుకున్న 68 మంది రైతుల్లో 51 మంది కౌలుదారులే
- మూడు నెల్లలో కేబినెట్ సబ్-కమిటీ ఒక్క మీటింగ్ పెట్టలే
హైదరాబాద్, వెలుగు: ఎల్-నినో కారణంగా పంటలు దెబ్బతినడంతో పరిహారం కోసం వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న సర్వేలో కౌలురైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ‘తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ’ ఆందోళన వ్యక్తం చేసింది.
గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో కమిటీ కన్వీనర్, ప్రొఫెసర్ డి.నరసింహారెడ్డితో పాటు పలు రైతు, ప్రజా
సంఘాల నేతలు క్షేత్రస్థాయిలో నిర్వహించిన అధ్యయన నివేదికను విడుదల చేశారు. పంట నష్టపోయిన కౌలు రైతులను తక్షణమే జాబితాలో చేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తప్పవని హెచ్చరించారు.
అధ్యయనంలో విస్తుపోయే వాస్తవాలు..
రాష్ట్రవ్యాప్తంగా 365 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో కౌలు రైతులే పంటలు సాగు చేస్తున్నా వ్యవసాయశాఖ చేపట్టిన సర్వేలో వారికి చోటు దక్కడం లేదని కమిటీ పేర్కొంది. రైతు స్వరాజ్య వేదిక బృందం ఆదిలాబాద్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో నిర్వహించిన అధ్యయనంలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయని వెల్లడించింది.
కమిటీ నవంబర్ 21 నుంచి 24 వరకు ఆదిలాబాద్ జిల్లాలో మూడు, వికారాబాద్ జిల్లాలో ఏడు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది. మొత్తం 145 మంది రైతులను కలవగా, వారిలో 89 మంది కౌలు రైతులుగా తేలింది. ఈ రైతులు 695 ఎకరాల్లో పంటలు సాగు చేస్తుండగా సగటున 66 శాతం పంట నష్టం జరిగింది. 112 మంది రైతులు 33 శాతం లేదా అంతకంటే ఎక్కువ నష్టం జరిగినట్లు తెలిపారు. 104 మంది సగానికి పైగా పంట నష్టపోయారు.
ఎకరానికి సగటున 10 క్వింటాళ్ల దిగుబడి రావాల్సిఉండగా, 376 ఎకరాల్లో ఎకరాకు 3.6 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చినట్టు స్టడీలో వెల్లడైంది. అయితే వీరిలో ఒక్కరిని కూడా సర్వేలో సాగుదారుగా నమోదు చేయలేదని నివేదిక పేర్కొంది. సంగారెడ్డి జిల్లా కోహీర్, జహీరాబాద్ మండలాల్లోని 6 గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర సాగుదారుల్లో 36 శాతానికి పైగా కౌలు రైతులు ఉన్నప్పటికీ, నవంబర్ 20 నాటికి ఆదిలాబాద్ జిల్లాలో 37,666 మంది పంట వివరాలను నమోదు చేయగా అందులో కేవలం 481 మంది (1.3%), సంగారెడ్డి జిల్లాలో 1,74,846 మందిలో కేవలం 8 మంది (0.005%) కౌలు రైతులు మాత్రమే ఉన్నారు.
క్షేత్రస్థాయి పర్యటనలే చేయలే..
పంటనష్టం సర్వే నిర్వహణలోనూ అనేక లోపాలు ఉన్నాయని కమిటీ ఆరోపించింది. చాలా గ్రామాల్లో కౌలు రైతులకు సర్వే షెడ్యూల్ గురించి సమాచారం ఇవ్వలేదని, పొలాలకు వెళ్లకుండానే భూ రికార్డుల ఆధారంగా వివరాలు నమోదు చేస్తున్నారని పేర్కొంది.
యాప్‌లో 'కౌలు సాగుదారుల' ఆప్షన్ ఉన్నప్పటికీ, స్పష్టమైన మార్గదర్శకాలు లేవనే కారణంతో వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవో) దానిని వినియోగించడం లేదు. సర్వేకు ముందే కోత పూర్తయిన మొక్కజొన్న, సోయాబీన్, పెసర, మినుము పంటలకు 65 శాతం నష్టం వాటిల్లినా, వాటిని సర్వేలో నమోదు చేయలేదు.
ఇప్పటికే భూ యజమాని పేరుతో పంట నష్టం నమోదు అయితే, ఆ వివరాలను సవరించి కౌలు రైతు పేరును చేర్చేందుకు యాప్‌లో అవకాశం లేదని నివేదికలో ప్రస్తావించింది. భూ యజమానుల నుంచి అభ్యంతరాలు వస్తాయన్న కారణంగా అధికారులు కౌలు రైతుల వివరాలను నమోదు చేసేందుకు వెనుకాడుతున్నారని కమిటీ ఆరోపించింది.
51మంది కౌలు రైతుల ఆత్మహత్య..
కౌలు రైతులు ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు, కొన్ని ప్రాంతాల్లో రూ.30 వేల వరకు కౌలు చెల్లిస్తున్నారు. ప్రైవేట్ అప్పులపై ఏటా 24 శాతం వరకు వడ్డీ చెల్లిస్తూ సాగు చేస్తున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వివరించింది. భారీగా కౌలు చెల్లించడం, పత్తి, కంది, సోయాబీన్ పంటల దిగుబడి సగానికిపైగా పడిపోవడంతో కౌలు రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు.
రెండు నెలల్లో రాష్ట్రంలో 68 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా, అందులో 51 మంది కౌలు రైతులే ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆగస్టు 28న డిప్యూటీ సీఎం అధ్యక్షతన కౌలు రైతుల గుర్తింపు కోసం కేబినెట్ సబ్-కమిటీ ఏర్పాటై మూడు నెలలు గడిచినా ఇప్పటివరకు మొదటి సమావేశం కూడా జరగలేదని, వెంటనే సమావేశం నిర్వహించాలని కోరింది.
అదేవిధంగా యాప్‌లో కౌలు రైతుల వివరాలు నమోదు చేయాలని, క్షేత్రస్థాయి తనిఖీలు చేసి రైతుల వివరాలు సేకరించాలని, గ్రామ పంచాయతీల వద్ద ముసాయిదా జాబితా ప్రదర్శన చేయడంతోపాటు పలు డిమాండ్లను సాధన కమిటీ వెల్లడించింది. ఈ సమావేశంలో రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు బి.కొండల్ రెడ్డి, శ్రీహర్ష తన్నీరు, విస్సా కిరణ్ కుమార్, కన్నెగంటి రవి, దళిత బహుజన ఫ్రంట్ నేత పి.శంకర్, తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ నేతలు ఎ.కవిత, కె. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
