హైదరాబాద్, వెలుగు: ఎస్సీ గురుకుల కిచెన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సొసైటీ ఫర్ సోషల్ జస్టిస్ ప్రెసిడెంట్ శేఖర్ కోరారు. హాస్టల్స్ లో ఫుడ్ పాయిజన్ ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, దీంతో స్టూడెంట్స్ చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఎస్సీ వెల్ఫేర్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎస్సీ గురుకుల సెక్రటరీ రవినాయక్ ను శేఖర్ కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు గురుకులాల్లో నాసిరకం, శుభ్రత లేని భోజనం కారణంగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ బారినపడి ఆస్పత్రుల పాలవుతున్నారని గుర్తుచేశారు.
కొన్ని సాంఘిక సంక్షేమ డిగ్రీ కాలేజీల్లో విద్యార్థినులకు బాత్రూమ్స్లోనే గర్భస్రావమైన ఘటనలు చోటుచేసుకోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఇలాంటి ఘటనలు ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తున్నాయని తెలిపారు. సీసీ కెమెరా రికార్డింగ్స్‌ను కనీసం 30 రోజులపాటు తప్పనిసరిగా భద్రపరచాలని, వాటి ఆధారంగా నిర్దేశిత గడువులోపు దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
