పెద్దపల్లి నేతలతో ఏఐసీసీ ఇన్‌చార్జ్ భేటీ

పెద్దపల్లి నేతలతో ఏఐసీసీ ఇన్‌చార్జ్ భేటీ
  • పార్లమెంట్ నియోజకవర్గంలోని పార్టీ నేతల సమన్వయంపై చర్చ 
  •     సందీప్‌ను కలిసిన మంత్రి వివేక్, ఎంపీ వంశీ కృష్ణ, ఎమ్మెల్యేలు వినోద్, ప్రేమ్ సాగర్, మక్కాన్ సింగ్ 
  •     ప్రభుత్వాన్ని, పార్టీని మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమన్న మంత్రి వివేక్
  •     స్థానిక మంత్రి, ఎంపీకి మధ్య ఉన్న వివాదంలో జోక్యం చేసుకోనని కామెంట్ 

 

 హైదరాబాద్, వెలుగు: పార్టీ నేతల మధ్య సమన్వయం కుదర్చడంపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌చార్జ్‌‌ బీఎం సందీప్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా గురువారం ఆయన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో వరుసగా సమావేశమయ్యారు. మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీ కృష్ణ, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్‌‌, ప్రేమ్ సాగర్‌‌‌‌తో సందీప్ వేర్వేరుగా భేటీ అయ్యారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడంతో పాటు రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆయన సూచించారు. పార్టీలో ఎవరితో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. సొంత పార్టీ నేతలపైనే బహిరంగంగా విమర్శలు చేసుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని హితవు పలికారు.

పార్టీ మారుతున్నట్టు తప్పుడు ప్రచారం: వివేక్​ 

తాను పార్టీ మారుతున్నట్టు తప్పుడు ప్రచారం జరుగుతుందని, అందులో ఎలాంటి నిజం లేదని మంత్రి వివేక్​ స్పష్టం చేశారు. ఇక పార్టీ ఇన్‌‌చార్జ్‌‌ సందీప్‌‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేయడంపై ఇన్‌‌చార్జ్‌‌తో చర్చించామని, ఈ అంశంపై తమ అభిప్రాయాలను ఆయనకు వివరించామని తెలిపారు. సిద్దిపేటలో పార్టీని బలోపేతం చేయడం, గిగ్ వర్కర్స్ చట్టం, కనీస వేతనాల సవరణ, ఏటీసీల ఏర్పాటు వంటి కార్యక్రమాలతో ప్రభుత్వ ప్రతిష్టను పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. తనపై అసూయ, ఈర్ష్యతో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

పార్టీలో ఎవరితోనూ తనకు వ్యక్తిగత విభేదాలు లేవని, పార్టీ అంతర్గతవిషయాలను మీడియా ముందు చర్చించడం తనకు ఇష్టం లేదన్నారు. తాను ఎవరిపైనా ఫిర్యాదులు చేయడం లేదని, తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నానని వెల్లడించారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి శ్రీధర్‌‌బాబు మధ్య భిన్నాభిప్రాయాల గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఎంపీ వంశీకృష్ణ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలరని, ఢిల్లీలో ప్రజా సమస్యలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేసే సామర్థ్యం ఆయనకు ఉందని మంత్రి వివరించారు. ఈ వ్యవహారంలో తాను ఎక్కడా జోక్యం చేసుకోలేదని, దాన్ని క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందన్నారు.