- ఏప్రిల్‌లో వీగిన బిల్లు ఆమోదానికి మళ్లీ కసరత్తు
- పాస్‌కు 361 ఓట్లు కావాలె.. ఎన్డీయే బలం 346
- డీఎంకే, ఎన్సీపీ (ఎస్పీ) మద్దతుపై కేంద్రం చూపు
- లోక్‌సభ సీట్లు 50 శాతం పెంచే ఫార్ములా?
- దక్షిణాది రాష్ట్రాలకు నష్టం: కాంగ్రెస్ ఆందోళన
న్యూఢిల్లీ: డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్‌తో ముడిపడిన రాజ్యాంగ సవరణ బిల్లు మళ్లీ పార్లమెంట్ ముందుకు రానుందా? ఈ నెల 30 నుంచి పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపరచాలని కేంద్రం నిర్ణయించడంతో ఈ చర్చ మొదలైంది. లోక్‌సభను 30న (సోమవారం), రాజ్యసభను డిసెంబర్ 2న (బుధవారం) తిరిగి సమావేశపరచాలని స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌ను కేంద్రం కోరింది. ‘అత్యవసర ప్రభుత్వ వ్యవహారాల’ కోసం ఈ సిట్టింగ్ జరుగుతుందని, వ్యవహారాలను బట్టి డిసెంబర్ 3న రెండు సభలూ ముగిసే అవకాశం ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గురువారం ‘ఎక్స్’లో ప్రకటించారు.
డీలిమిటేషన్‌తో ముడిపడిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు–2026ను కేంద్రం ఈ సిట్టింగ్‌లో మళ్లీ ప్రవేశపెట్టొచ్చని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. శుక్రవారం కేంద్ర కేబినెట్ సమావేశమై డీలిమిటేషన్‌తో ముడిపడిన మహిళా కోటా బిల్లుపై చర్చించొచ్చని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. సిట్టింగ్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ కూడా శుక్రవారం భేటీ కానుంది. డిసెంబర్ 15లోగా పార్లమెంట్ సమావేశాలకు సిద్ధం కావాలని, ఆలోపు విదేశీ పర్యటనలు పెట్టుకోవద్దని ప్రధాని మోదీ బుధవారం కేబినెట్ భేటీలో మంత్రులకు సూచించినట్లు తెలిసింది.
ఏప్రిల్‌లో వీగిన బిల్లు
ఈ బిల్లు ఏప్రిల్ 17న జరిగిన ప్రత్యేక సిట్టింగ్‌లో అవసరమైన మెజారిటీ దక్కక వీగిపోయింది. రాజ్యాంగ సవరణ బిల్లు పాసు కావాలంటే సభకు హాజరై ఓటేసిన వారిలో మూడింట రెండొంతుల మద్దతు కావాలి. 543 మంది సభ్యుల లోక్‌సభలో ఆ సంఖ్య 361గా లెక్కగట్టారు. ఎన్డీయేకు 320 మంది సభ్యులు ఉండగా, ఆ తర్వాత 26 మంది ఎంపీలు ప్రతిపక్ష శిబిరం నుంచి బయటికొచ్చారు. 20 మంది తృణమూల్ కాంగ్రెస్ రెబల్ ఎంపీలు నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ)లో విలీనమై ఎన్డీయేకు మద్దతు ప్రకటించగా, శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు ఏక్‌నాథ్ షిండే శివసేనలో చేరారు. దీంతో ఎన్డీయే బలం 346కు చేరినా, బిల్లు పాసుకు ఇంకా 15 మంది మద్దతు కావాలి. 22 మంది ఎంపీలున్న డీఎంకే, 8 మంది ఉన్న ఎన్సీపీ (శరద్ పవార్) కీలకం కానున్నాయి. బిల్లు ప్రవేశపెట్టినప్పుడు చర్చిస్తామని, దేశ ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటే మద్దతిస్తామని ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే చెప్పారు.
సీట్లు 50 శాతం పెంపు ఫార్ములా?
రాష్ట్రాలన్నింటిలో లోక్‌సభ సీట్లను 50 శాతం పెంచే ఫార్ములాను కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 1971 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాల మధ్య ఇప్పుడున్న సీట్ల వాటాను అలాగే కొనసాగించి, డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందనే ఆందోళనలకు పరిష్కారం చూపాలన్నది ఈ ఫార్ములా ఉద్దేశం. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
దక్షిణాదికి నష్టం: కాంగ్రెస్
డీలిమిటేషన్‌ను అన్ని పార్టీలతో చర్చించి ఏకాభిప్రాయంతో తేల్చాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ మార్గాన్ని సూచిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే గత ఏడు నెలల్లో నాలుగుసార్లు (ఏప్రిల్ 11, జులై 16, ఆగస్టు 27, అక్టోబర్ 16) ప్రధానికి లేఖలు రాసినా కనీస స్పందన కూడా లేదని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ విమర్శించారు. ‘డీలిమిటేషన్ బిల్లుల కోసం మూడింట రెండొంతుల మెజారిటీ సాధించేందుకు సామ, దాన, భేద, దండోపాయాల్లో చివరి మూడూ ప్రయత్నించి విఫలమయ్యారు. మొదటిదాన్ని (చర్చలతో ఒప్పించడం) ఎందుకు ప్రయత్నించరు?’ అని ఎద్దేవా చేశారు. ప్రస్తుత 543 లోక్‌సభ సీట్లు, రాష్ట్రాలవారీ పంపకం యథాతథంగా ఉంచాలని, మహిళలకు 182 సీట్లు రిజర్వ్ చేయాలని, ఈ నిబంధనలను 25 ఏండ్ల పాటు ఫ్రీజ్ చేయాలని కాంగ్రెస్ నాలుగు సూత్రాల ఫార్ములా ప్రతిపాదిస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో జనగణన ఫలితాలు రానుండటంతో ఆర్టికల్ 82 ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియ మొదలవుతుందని, అది దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కువ నష్టం చేస్తుందని, అందుకే ఏకాభిప్రాయం తప్పనిసరి అని జైరాం రమేశ్ అన్నారు.
100 రోజులైనా ప్రొరోగ్ కాలే
శీతాకాల సమావేశాల ప్రకటనలో జాప్యంపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ ప్రకటన చేసింది. ఆగస్టు 13న నిరవధికంగా వాయిదా పడిన వర్షాకాల సమావేశాలను 100 రోజులు దాటినా ఇంకా ప్రొరోగ్ చేయలేదు. డీలిమిటేషన్‌తో పాటు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై ప్రతిపక్షాలు ఈ సిట్టింగ్‌లో కేంద్రాన్ని నిలదీయనున్నాయి. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేయనున్నాయి.
