2029 నాటికి డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడతాం : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

2029 నాటికి  డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడతాం :  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
  •  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపు
  •  ఎక్కడైనా డ్రగ్స్ అమ్మినా గురుద్వారా ముందు తోలుతీస్తం 
  •  ప్రచారం లైకుల కోసం కాదు.. సమాజం కోసమేనని కామెంట్​ 
  •  కన్నీళ్లతో వ్యాపారం చేసేవాళ్లను వదలం: బండి సంజయ్ 
  • యాత్రలో అడుగు కలిపిన పుల్లెల గోపీచంద్, బెల్లంకొండ శ్రీనివాస్

హైదరాబాద్, వెలుగు: దేశం నుంచి 2029 నాటికి డ్రగ్స్ మహమ్మారిని పూర్తిస్థాయిలో తరిమికొడతామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ పాదయాత్ర ఏదో ప్రచారం కోసమో, సోషల్ మీడియా లైకుల కోసమో, బ్రేకింగ్ న్యూస్ కోసమో చేస్తున్నది కాదని.. మన సమాజాన్ని, భవిష్యత్ తరాలను రక్షించుకోవడానికి చేస్తున్న పోరాటమని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు మూడేండ్లపాటు ప్రతి ఇంటికీ తిరిగి డ్రగ్స్ నిర్మూలన చేపడుదామన్నారు. 2029 నాటికి ఎక్కడైనా డ్రగ్స్ తయారు చేసినా, అమ్మినా, వాడినా అమీర్‌పేట గురుద్వారా ముందు వారి తోలుతీస్తామని హెచ్చరించారు. గురువారం రెండో రోజు పాదయాత్ర ముషీరాబాద్ కశిష్ ఫంక్షన్ హాల్ వద్ద ప్రారంభమై... రాత్రి అమీర్‌పేట సత్యం థియేటర్ వద్ద ముగిసింది. సాయంత్రం అమీర్‌పేటలో కిషన్ రెడ్డి పాదయాత్ర వద్దకు చేరుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జాతీయ జెండా చేతపట్టి ఆయనతో కలిసి నడిచారు. 

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ పోరాటంలో ఎవరూ ప్రేక్షకులుగా మిగిలిపోవద్దని, పత్రికలు, మీడియా కూడా ప్రతిరోజూ యువతను చైతన్యపరచాలని కోరారు. నేడు విద్యార్థులతోపాటు డాక్టర్లు, ఐటీ, ప్రైవేట్ ఉద్యోగులు మత్తు బారిన పడటం ఆందోళనకరమన్నారు. గిరిజన రైతులను మోసం చేసి వికారాబాద్ సహా దట్టమైన అడవుల్లో దేశద్రోహులు గంజాయి సాగు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాక్లెట్లు, బిస్కెట్లు, సిగరెట్లు, ఇంజెక్షన్ల రూపంలో సింథటిక్ డ్రగ్స్ బస్తీల్లోకి రావడం ప్రమాదకరమన్నారు. డ్రగ్స్ తయారు చేసినా, సరఫరా చేసినా, విక్రయించినా ప్రపంచంలో ఎక్కడున్నా పట్టుకొచ్చి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.  శుక్రవారం జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ గ్రౌండ్‌లో జరిగే తొలి దశ ముగింపు బహిరంగ సభకు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ గురూజీతో పాటు పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు హాజరవుతారని కిషన్ రెడ్డి వెల్లడించారు. 

సమాజ కన్నీళ్లతో వ్యాపారం చేసేవాళ్లను వదలం: బండి సంజయ్

‘డ్రగ్స్ అంతం మనందరి పంతం. మత్తు కొన్ని గంటలే.. కానీ దాని వల్ల జరిగే నష్టం జీవితాంతం. అది ఆరోగ్యాన్నే కాదు.. కుటుంబ ఆశలను, ఒక తరం భవిష్యత్తును నాశనం చేస్తుంది’ అని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. డ్రగ్స్ బాధిత కుటుంబాలను చూసి ప్రధాని మోదీ కంటతడి పెట్టుకున్నారని, ఉక్కు సంకల్పంతో ‘నషా ముక్త్ భారత్’ కార్యాచరణ చేపట్టారని తెలిపారు. ‘మీరు అమ్మేది డ్రగ్స్ కాదు.. మన పిల్లల భవిష్యత్తు.. కుటుంబాల కన్నీళ్లతో వ్యాపారం చేస్తున్నారు. బానిసైన యువకుడిని అక్కున చేర్చుకుని కౌన్సిలింగ్ ఇద్దాం.. మాఫియాను అంతం చేద్దాం’ అని పిలుపునిచ్చారు. 

అడుగు కలిపిన క్రీడా, సినీ ప్రముఖులు.. 

యాత్రలో ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అడుగు కలిపారు.  ‘సే ఎస్ టు స్పోర్ట్స్.. సే నో టు డ్రగ్స్’, ‘సే ఎస్ టు ఎక్సర్‌సైజ్.. సే నో టు డ్రగ్స్’ అంటూ యువతకు పిలుపునిచ్చారు. సినీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పాల్గొని డ్రగ్స్ రహిత భారత్ కోసం అందరితో ప్రతిజ్ఞ చేయించారు. దర్శకుడు సురేశ్, పద్మశ్రీ గడ్డం సమ్మయ్య, డాక్టర్ విజయ ఆనంద్ రెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు. మరోవైపు కిషన్ రెడ్డి సంకల్పానికి కుటుంబ సభ్యులు అండగా నిలిచారు. రెండు రోజులుగా సతీమణి కావ్య కిషన్ రెడ్డి ఆయనతో కలిసి నడుస్తుండగా, కుమార్తె వైష్ణవి రెడ్డి యాత్రలో పాల్గొన్నారు.