- సాంకేతిక లోపంతో అత్యవసర ల్యాండింగ్‌కు యత్నం
- ట్రైనీ పైలట్, ఇన్‌స్ట్రక్టర్‌కు గాయాలు.. తృటిలో తప్పిన పెనుప్రమాదం
మెహిదీపట్నం, వెలుగు: హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్ పరిధిలో గురువారం ట్రైనీ విమానం ప్రమాదానికి గురైంది. తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీకి చెందిన ‘సెస్నా 152’ విమానం సాంకేతిక లోపంతో అత్యవసరంగా ల్యాండ్ అయ్యే క్రమంలో చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రైనీ పైలట్, ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్‌కు గాయాలయ్యాయి. సాధారణ శిక్షణలో భాగంగా గాలిలో ఎగురుతున్న విమానంలో ఒక్కసారిగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్లు గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో అత్యవసరంగా ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో విమానం అదుపుతప్పి చెట్టును ఢీకొని ఆగిపోయింది. విమానంలో ఉన్న ట్రైనీ పైలట్ అనుష్క బాజ్‌పాయ్ (23), ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ కెప్టెన్ ఎం. ప్రశాంత్ కుమార్ (30) తలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఆర్మీ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వారిని మొదట మిలటరీ దవాఖానకు, అక్కడి నుంచి లంగర్‌హౌస్‌లోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. ట్రైనీ పైలట్‌కు తలకు కుట్లు వేసి అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదంలో విమానం రెక్క విరిగిపోగా, విమానం తీవ్రంగా దెబ్బతింది. గోల్కొండ పోలీసులు, ఆర్మీ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) విచారణ చేపట్టనుంది.
