ప్రపంచ వాతావరణ వార్షిక సదస్సు గత 9 నవంబర్ నుంచి 22 వరకు టర్కీ దేశంలోని ఆంటల్య నగరంలో జరిగింది. ఇది 31వ సదస్సు. ప్రపంచంలో నిత్యం జరుగుతున్న సమావేశాలలో ఒకే అంశం ప్రాతిపదికన జరుగుతున్న సదస్సు వేరే ఏదీ లేదు. 1995లో మొట్టమొదటి వాతావరణ సదస్సు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. అప్పటినుంచి దాదాపు ప్రతి ఏటా ఈ సదస్సులను కాప్ (COP) సదస్సులుగా పిలుస్తున్నారు.చాలామంది ఇది ఒక పర్యావరణవేత్తల సదస్సుగా తప్పుగా భావిస్తుంటారు. కాప్ సదస్సులు కేవలం పర్యావరణం కోసం కాదు. ప్రపంచ ఆర్థిక, వినిమయ సంస్కృతితో ముడిపడిన ఈ సదస్సు లక్ష్యాలు మానవ జీవన క్రమాన్ని ఉమ్మడిగా మార్చడానికి నిర్వహిస్తున్నారు. ప్రకృతి మీద మానవుల విధ్వంసాన్ని ఏకాభిప్రాయ సాధన ద్వారా తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సదస్సు నుంచి వెలువడిన నిర్ణయాలు ఏకాభిప్రాయం తరువాతనే అమలులోకి వస్తాయి. అభిప్రాయాలు ఏర్పడడానికి శాస్త్రీయ పరిశోధనలు ఐపిసిసి నివేదికలు, ఇంకా ఇతర అనేక సంస్థల పరిశోధనలు ఉపయోగపడుతున్నాయి.
పెరుగుతున్న కర్బన కాలుష్యం వల్ల మానవాళి మనుగడకే ప్రమాదం తెస్తున్న పుడమి ఉష్ణోగ్రతలను తగ్గించడమే లక్ష్యంగా ఈ సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇందులో పర్యావరణం పట్ల ఆందోళన ఉన్న వ్యక్తులు, సంస్థల కంటే 197 దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు క్రమంగా తేటతెల్లం అవుతున్నాయి. అనేక వివాదాలను, జగడాలను వివిధ వార్షిక సదస్సుల ద్వారా పరిష్కరించినా వాతావరణ మార్పును ఎదుర్కొనే యుద్ధనీతి కోసం ప్రపంచ దేశాలు ఒకే గాటన రాలేకపోతున్నాయి. స్థూలంగా మానవుల కాలుష్య కార్యకలాపాల వలన, తమ జీవన వినియోగానికి, విలాసాల కోసం చేస్తున్న ప్రకృతి వనరుల విధ్వంసం వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మానవ కార్యకలాపాలలో తీవ్ర మార్పులు అవసరమని అందరూ గుర్తిస్తున్నా ప్రకృతిని సంరక్షించే బాట వైపు ఐకమత్యంతో అడుగులు వేయడానికి ప్రపంచ దేశాలు సిద్ధంగా లేవు. రాజకీయ నాయకత్వం నిష్క్రియాపరత్వం వల్ల ప్రకృతి వ్యవస్థల మీద మానవుల దాష్టీకం నిత్యం పెరుగుతున్నది. అసాధారణ పరిస్థితులు కనపడుతున్నా, అనుభవంలోకి వస్తున్నా మూల కారణాల మీద, సమస్య లోతుల గురించిన అవగాహన లేకపోవడం కూడా ఒక బలహీనతగా మారింది. ప్రపంచ వాతావరణ సదస్సు మొదటినుంచీ కూడా ఏకాభిప్రాయ సాధన అనంతరమే ఒక నిర్ణయానికి రావడం పరిపాటి. ఇదే దీని బలం. ఇదే దీని బలహీనత.
ప్రళయం ముంచుకొస్తున్నా..
ప్రకృతి వనరుల మీద నిర్మాణమైన ఆర్థిక వ్యవస్థలు, విలాసవంతమైన జీవితం వదులుకోవడానికి ప్రపంచ కుబేరులు సిద్ధంగా లేరు. వారు ఆయా దేశాల ప్రతినిధులను ప్రభావితం చేస్తున్నారు. ప్రతి కాప్ సదస్సులో కుబేర, బహుళ జాతి సంస్థల ప్రతినిధులు కొన్ని దేశాల ప్రతినిధులుగా హాజరై తమ వ్యాపారానికి, సంపద సృష్టికి విఘాతం చేసే అంశాల మీద మోకాలు అడ్డుతున్నారు. అనేక అంతర్జాతీయ పరిశోధన సంస్థలు వివిధ పరిశోధనల ద్వారా ఎవరు, ఎక్కడ, ఏ విధంగా నష్టపోతారో, ఇప్పటికే నష్టపోతున్నారో విడమర్చి చెప్పే నివేదికలు నిత్యం విడుదల చేస్తూనే ఉన్నాయి. ప్రళయం ముంచుకొస్తోంది అని భయపెట్టే శాస్త్రీయ అంచనాలు కూడా వస్తూనే ఉన్నాయి. కానీ సదస్సు ప్రతినిధులను ఇవి ఏవీ కదిలించడం లేదు. వారిని సంయుక్త కార్యాచరణకు ఉసికొల్పడం లేదు. భవిష్య ఉమ్మడి వినాశన వాణులు కూడా పని చేయనప్పుడు, శాస్త్రీయ అవగాహన కూడా పట్టించుకోని సందర్భంలో ఈ సదస్సులు ఏమి సాధించగలవు అనేదే ప్రశ్న.
రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల వేదికగా మారింది
అన్ని చోట్ల మనం గమనిస్తున్నట్లే ప్రపంచ వాతావరణ సదస్సు కూడా రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం సంఘర్షణ వేదికగా మారింది. మానవ నాగరికతనే మార్చుకునే వేదికగా ఏర్పడిన ఈ సదస్సులు క్రమంగా అగ్రరాజ్యాధినేతల ఆధిపత్య పోరుకు సమిధగా మారుతున్నాయి. ఈ సదస్సులలో రాజకీయ, ఆర్థిక, సాంఘిక, శాస్త్రీయ అంశాలు నిత్యం ఒకదానికొకటి ముడిపడి ఎదురవుతుంటాయి. మానవ జీవనాన్ని సమూలంగా మార్చే ప్రక్రియ ఈ సదస్సులలో ఇమిడి ఉంది. ఇందులో పెట్టుబడిదారీ విధానాలు, కమ్యూనిస్ట్, సోషలిస్టు సిద్ధాంతాలు కూడా కలిసిపోయాయి.
కుండలో వేసి ఉడకపెట్టిన తీరుగా అన్నీ కలిసి ఒక కొత్త మానవ జీవన విధానానికి అడుగులు వేయడానికి ఈ సదస్సులు జరుగుతున్నాయి. అయితే, ఈ సదస్సులు వేస్తున్న బుడిబుడి అడుగులు ఎవరికీసంతృప్తిని ఇవ్వడం లేదు. కర్బన కాలుష్యం తగ్గడం లేదు. ఆధునిక నాగరికతను ప్రశ్నించేవారే కరువు అయ్యారు. నిత్య రాజకీయాల బురద దాటి ప్రాపంచిక దృష్టికోణంతో ఆలోచించే దిగ్గజ నాయకుడు ఈ సదస్సులలో కానరావడం లేదు. సుస్థిర పుడమికి కావాల్సిన రాజకీయ దురంధరులు ఉద్భవిస్తలేరు. వ్యతిరేకించే నాయకులు మాత్రం ప్రతి సదస్సులో ప్రత్యక్షం అవుతున్నారు. ప్రతి దేశం ప్రకటించే లక్ష్యాలు, తీసుకునే చర్యలు పుడమి ఉష్ణోగ్రత 1.5C (సెంటిగ్రేడ్) దాటకుండా ఉండాలని పారిస్ ఒప్పందంలో ఉన్నా.. కాలుష్యం చేస్తున్న దేశాలు తమ విధానాలు, ఆర్థిక వ్యవస్థను మార్చుకోవడానికి ఇష్టపడడం లేదు.
సదస్సు వైఫల్యం కాదు
విస్తృతమైన, విభిన్నమైన ఆందోళనలను ఒక పొందికైన, నిర్మాణాత్మక ప్రకటనగా తీసుకురావడంలో COP31 నాయకత్వం విఫలమైంది. శిలాజ ఇంధన పరివర్తన నుండి దృష్టి మరల్చడానికే కాబోలు, కాప్ నిర్వహిస్తున్న టర్కీ, ఆస్ట్రేలియా దేశాల ఉమ్మడి నాయకత్వం 35 బై 35 విద్యుదీకరణను చర్చల
ప్రవాహంలోకి బలవంతంగా చేర్చాలని కోరుకున్నారు. ఐరోపా దేశాల కూటమి మీద నిధులు గురించి ఒత్తిడి ఉన్నది. ఈ ఒత్తిడి నుంచి ఉపశమనానికి, ఒక సూత్రబద్ధమైన వైఖరిని తీసుకుని, కవర్ టెక్స్ట్‌లో ‘శిలాజ ఇంధనాల’ మీద ఉన్న రగడను సాకుగా తీసుకుని, ఉమ్మడి ప్రతిని తీవ్రంగా వ్యతిరేకించింది. ఎందుకంటే, ధనిక దేశాలు, కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు నిధులు ఇవ్వాలని పారిస్ ఒప్పందం లో సూత్రప్రాయ అంగీకారం ఉన్నది. దాని ప్రకారం వర్ధమాన దేశాలకు వాతావరణ మార్పులను తట్టుకునే శక్తి చర్యలకు కావాల్సిన ఆర్థిక సహాయంపై చాలాకాలంగా అనేక డిమాండ్లు ఉన్నాయి. ఇంకొక వైపు కర్బన ఉద్గారాలు వేగంగా తగ్గించాలంటే శిలాజ ఇంధనాలను మండించే వ్యవస్థ మీద పెట్టుబడులను తగ్గించాలని ఒక డిమాండ్ కాప్ సదస్సులలో ఉన్నది. శిలాజ ఇంధన పరివర్తనగా భావించే ఈ రకమైన ప్రాపంచిక పరిష్కారం పట్ల కొన్ని దేశాలు, ప్రత్యేకంగా రష్యా, సౌదీ అరేబియా అనుకూలంగా లేవు. వారి ఒత్తిడి మేరకు కవర్ ప్రతిలో దీనిని తొలగించారు. తొలగించినందుకు ఐరోపా కూటమికి, ఇతర దేశాలకు కోపం వచ్చింది. బలమైన దేశాలు, కాలుష్యం చేస్తున్న దేశాలు, నిబద్దత లేని దేశాలు, కొన్ని పదాలను సాకుగా చూపి, ఉమ్మడి నిర్ణయం వెలువడకుండా అడ్డుపడ్డారు.
ఉమ్మడి ప్రపంచ చర్య అవసరం
కాప్‌ని సంస్కరించి బలోపేతం చేయాలనేది చాలాకాలంగా ఉన్న డిమాండ్. దీనిపై ఇప్పుడు అనేక ఆలోచనలు మళ్లీ తెరపైకి వచ్చాయి. అందులో మొదటిది ఏకాభిప్రాయ నిర్ణయం. వాతావరణ చర్యకు ప్రతిఒక్కరూ కలిసి రావాలి, ముఖ్యంగా భారీ ఉద్గారాలను విడుదల చేసే దేశాలు. ఇప్పటివరకు ప్రపంచం శిలాజ ఇంధనాలను ఎవరు ఎక్కువగా దహనం చేస్తున్నారనే దానిపైనే కాప్ దృష్టి సారించింది. శిలాజ ఇంధన పరివర్తనకు ఇటీవలి వ్యతిరేకత వాటిని వ్యాపారంగా, ఆర్థిక వనరుగా, మైనింగ్ చేస్తున్న దేశాల నుంచి వచ్చింది. వాటిని ఎవరు వెలికి తీస్తున్నారనే దాని నుండి వచ్చింది.
ఈ అంశాన్ని పారిస్ ఒప్పందంలో తదుపరి కూడా విస్మరించారు. వారిని ఏకాకిని చేసి, ఒక గీత గీసే ఓటింగ్ వారిని దారికి తీసుకురాలేకపోవచ్చు. నిజానికి వారు UNFCCC నుండి పూర్తిగా వైదొలిగే ప్రమాదం కూడా ఉంది. మరోవైపు ఓటింగ్ ద్వారా తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడం కష్టమవుతుంది. కాప్ నిర్ణయాలను అమలు చేయడానికి ప్రపంచ ప్రభుత్వం లేదు. ఉమ్మడి ప్రపంచ చర్య స్వచ్ఛందంగా మాత్రమే సాధ్యమవుతుంది. మెజారిటీ నిర్ణయాన్ని అమలు చేయగల సానుకూలశక్తి ఏదీ లేదు. మునుపటిలానే కాప్ సూత్రాలను అనుసరిస్తూ దేశాలు ఏకతాటిపై నిలబడేలా ఒత్తిడి తేవడమే ఉత్తమం. కాప్ సంస్కరణల మీద ఇంకా లోతైన చర్చ అవసరం ఉన్నది. కాప్31 ఉమ్మడి ప్రకటన రాకున్నా కాప్‌లో అనేక అంశాల మీద చర్చలు సాధారణ స్థాయిలోనే కొనసాగుతున్నాయి.
- డా. దొంతి నరసింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
[email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
