ప్రజాస్వామ్యానికి జవాబుదారీతనం అవసరం. అదేవిధంగా ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించడంలో కూడా సంయమనం అవసరం. క్రిమినల్ లా చట్టబద్ధమైన హక్కులను పరిరక్షించాలి. అంతేగానీ భిన్నాభిప్రాయాల్ని అణచివేసే యంత్రాంగంగా మారకూడదు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ తన ఎన్నికల ఫైలింగ్‌లు, బహిరంగ ప్రకటనలలో భాగంగా 2026 చివరినాటికి తనపై సుమారు 19 క్రిమినల్ కేసులు ఉన్నట్టు ప్రకటించారు. దేశవ్యాప్తంగా తనపై 45 వరకు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని బహిరంగంగా పేర్కొన్నారు. 2014 ఎన్నికలకు ముందు.. నాథూరామ్ గాడ్సే చేత మహాత్మా గాంధీ హత్యకు గురయ్యారనే విషయంపై సుబ్రమణియన్ స్వామి దాఖలు చేసిన ఒక నేషనల్ హెరాల్డ్ కేసు, భారతీయ జనతా పార్టీకి చెందిన మరో నాయకుడు భివండి (గుజరాత్) కోర్టులో దాఖలు చేసిన ఒక క్రిమినల్ పరువు నష్టం కేసు ఉన్నాయి. ఒక కేసు నరేంద్ర మోదీకి సంబంధించినది కాగా, మరొకటి అమిత్ షాకు సంబంధించినది. ఈ కేసులన్నీ ఆయన ఎన్నికల ప్రచారాల సమయంలో లేదా దేశంలో ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల హక్కులను సమర్థిస్తూ చేసిన ప్రసంగాలకు వ్యతిరేకంగా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని ఎంపీ, -ఎమ్మెల్యే స్పెషల్ కోర్టు పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని నిర్దోషిగా విడుదల చేస్తూ.. ఆయనపై ఆరోపించిన వ్యాఖ్యలు ఒక నిర్దిష్ట రాజకీయ సందర్భంలో చేసినవని, ఫిర్యాదుదారుడిని ఉద్దేశించినవి కావని పేర్కొంది. అందువల్ల ఫిర్యాదుదారుడికి ఫిర్యాదు చేసే హక్కు (లోకస్ స్టాండీ) లేదని ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. రాజకీయ విమర్శలు, క్రిమినల్ పరువు నష్టం ఫిర్యాదులు అవసరమైన చట్టపరమైన ప్రమాణాలను తప్పనిసరిగా సంతృప్తిపరచాలని ఆ తీర్పు నొక్కి చెప్పింది.
రాజ్యాంగ స్ఫూర్తి నిర్వీర్యం
రాహుల్‌పై నమోదైన కేసులలో అత్యధికంగా 2014 నుండి 2026 మధ్యనే దాఖలయ్యాయి, వీటిలో ప్రధానంగా క్రిమినల్ పరువు నష్టం ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయి. గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయి నుండి సుష్మా స్వరాజ్ వరకు బీజేపీ ప్రతిపక్ష నాయకులు జవహర్‌లాల్ నెహ్రూ, సోనియా గాంధీలపై ఇంతకంటే తీవ్రమైన భాషను ఉపయోగించారు. కానీ వారి భిన్నాభిప్రాయం ఎంత తీవ్రమైనదైనప్పటికీ వారిని నేరస్థులుగా పరిగణించలేదు. ఇప్పటివరకు రష్యా, చైనాలాంటి ఏకవ్యక్తి నియంతృత్వ దేశాలలో అసమ్మతిని నేరంగా పరిగణించడం కనిపించింది. కానీ ప్రపంచంలోని ఏ రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాన్ని/అసమ్మతిని నేరంగా పరిగణించడం చాలా అరుదుగా జరుగుతుంది. 1975–-77 ఎమర్జెన్సీ సమయంలో సైతం రాజకీయ శత్రువులందరినీ నేరస్థులుగా కాకుండా, రాజకీయ ఖైదీలుగా జైలులో పెట్టారు. ఈ కొత్త పద్ధతి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని క్రమంగా నిర్వీర్యం చేయడానికి చేసిన ఒక రాజకీయ నూతన ఆవిష్కరణ. ఈ విధంగా ప్రతిపక్ష నాయకుడిని రాజకీయంగా హతమార్చినప్పుడు, ప్రజాస్వామ్య మౌలిక స్వరూపమైన ప్రతిపక్షం అంతమైపోతుంది. అప్పుడు రాజ్యాంగ ఉనికికే అర్థం ఉండదు.
ప్రజాస్వామ్యంలో అసమ్మతి నేరంగా...
రాహుల్ గాంధీపై ఉన్న కేసులను స్థూలంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. క్రిమినల్ పరువు నష్టం (సెక్షన్ 500 ఐపీసీ), మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం (సెక్షన్ 295A ఐపీసీ), మతాలు లేదా వర్గాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టడం (సెక్షన్ 153A ఐపీసీ). అయితే పరువు నష్టం కలిగించే ప్రకటనలు, మత మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో చేసే చర్యలు, లేదా వర్గాలు లేదా మతాల మధ్య శత్రుత్వాన్ని సృష్టించే చర్యలతో సహా నేరపూరిత చర్యలకు చట్టపరమైన పరిష్కారాలను కోరే హక్కు నిస్సందేహంగా ప్రతి పౌరుడికీ ఉంది. కానీ చట్టం, ముఖ్యంగా క్రిమినల్ చట్టం.. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి లేదా సుదీర్ఘమైన వ్యాజ్యాల ద్వారా వారిని అలసిపోయేలా చేయడానికి ఒక అనుకూలమైన సాధనంగా మారకూడదు. డిఫమేషన్ (పరువు నష్టం) అనే అంశానికి క్రిమినల్ చట్టంలో అసలు చోటు ఉండకూడదు. ఇది సివిల్ చట్ట పరిధిలోకి మాత్రమే రావాలి. అయినప్పటికీ క్రిమినల్ పరువు నష్టం అనేది రాజకీయ
అహంకారాన్ని కాపాడటానికి లేదా ఒక రాజకీయ ప్రత్యర్థిపై, ముఖ్యంగా ప్రతిపక్ష నేతలపై ప్రతిపక్షంపై చట్టపరమైన భయోత్పాతాన్ని సృష్టించడానికి ఉద్దేశించినది కాదు. ఈ ధోరణి ప్రజాస్వామ్య రాజకీయ పోరాటాలను నాశనం చేస్తుంది.
రాహుల్ గాంధీకి శిక్షపై సుప్రీంకోర్టు స్టే
‘మోదీలు దొంగలు’ అని రాహుల్ గాంధీ చేసిన రాజకీయ వ్యాఖ్య కారణంగా గుజరాత్‌లోని సూరత్ కోర్టులో నమోదైన కేసు నిజంగా హాస్యాస్పదంగా ఉంటుంది. యూపీకోర్టు తీర్పు, అనేక రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులు స్పష్టం చేసినట్లుగా, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలకు సంబంధించి ఒక (వ్యక్తిగత దూషణకు/వ్యక్తిత్వ హననకు గురైన) ‘వ్యక్తి’ ఉండాలనేది ప్రాథమిక న్యాయ సూత్రం. ఎవరి ప్రతిష్టకైతే భంగం కలిగిందో, ఆ వ్యక్తికి మాత్రమే పరువు నష్టం దావా వేసే హక్కు ఉంటుంది. అవమానకరమైనవిగా ఆరోపించిన వ్యాఖ్యలకు నేరుగా సంబంధంలేని ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదు వలన మొదలైన కేసు చివరకు రాహుల్ గాంధీకి శిక్ష పడేలా చేసింది. ఆయనకు శిక్ష పడిన వెంటనే కేంద్రలోని అధికార పార్టీ రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ శిక్షపై స్టే విధించింది.
ఈ క్రమంలో చాలాకాలం క్రితమే మరణించిన సావర్కర్ గురించి చేసిన వ్యాఖ్యకు సంబంధించి కూడా ఆయన పరువు నష్టం కేసును ఎదుర్కొంటున్నారు. ‘వర్గాల మధ్య లేదా మతాల మధ్య శత్రుత్వాన్ని సృష్టించడం, లేదా మతపరమైన మనోభావాలను అవమానించడం’ అని ఆరోపించిన వ్యాఖ్యల నుండి ఉత్పన్నమయ్యే కేసులు దాదాపు అన్ని సందర్భాల్లో నిరాధారమైనవి. వీటిలో అనేక కేసులు సుప్రీంకోర్టు పూర్వతీర్పులకు విరుద్ధమైనవి. అటువంటి కేసులలో ప్రాథమిక ప్రశ్న ఏమిటంటే.. క్రిమినల్ చట్టాన్ని ప్రయోగించడానికి ఆ మాటలను, ప్రకటనలను ఎవరు నిర్ధారించాలి? సుప్రీంకోర్టు ఈ ప్రశ్నకు (2007) 5 SCC1లో రిపోర్ట్ అయిన ‘మంజర్ సయీద్ ఖాన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర’, ‘వినోద్ హన్స్‌రాజ్ గోయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర’ కేసులలో సమాధానమిచ్చింది. ఒక వచనం (లేదా ప్రసంగం) నుండి ఇక్కడొక వాక్యం, అక్కడొక వాక్యం తీసుకుని వాటిని అనుమానాత్మకంగా అతికించి తీవ్రమైన పదజాలంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఆ మాటల ప్రభావాన్ని వివేకవంతులైన, దృఢ సంకల్పంగల, స్థిరమైన, తార్కికమైన వ్యక్తుల ప్రమాణాలతో నిర్ధారించాలి. అంతేగానీ బలహీనమైన, స్థిరత్వం లేని మనస్తత్వాలు, లేదా ప్రతికూల దృక్పథం కనిపించిన ప్రతిసారి ఏదో ప్రమాదం జరిగిపోతుందని ఊహించుకునేవారి దృక్కోణంలో కాదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తీవ్రమైన పదజాలంతో కూడిన ప్రసంగాలను/మాటలను విశ్లేషించేటప్పుడు ఒక వివేకవంతుడి ప్రామాణికాన్ని వర్తింపజేయాలి. చట్టం సుస్థిరమై, సీ.ఆర్.పీ.సీ (ప్రస్తుతం బీ.ఎన్.ఎస్.ఎస్)లోని నిబంధనలకు లోబడి ఉన్నప్పటికీ, ఒక వ్యక్తి దేశవ్యాప్తంగా ఇన్ని కేసులను ఎలా ఎదుర్కొంటున్నాడు?.
న్యాయ వ్యవస్థను రాజకీయం చేయడం
నిజానికి ఈ సమస్య ఏ ఒక్క రాజకీయ నాయకుడికి మాత్రమే పరిమితం కాదు. న్యాయ వ్యవస్థను ఈ విధంగా దుర్వినియోగం చేసే ప్రక్రియ క్రమంగా మొత్తం న్యాయ వ్యవస్థను రాజకీయం చేస్తుంది. కోర్టు గదిని రాజకీయ రణరంగంగా మార్చే ప్రమాదం ఉంది. ప్రతి వివాదాస్పద వ్యాఖ్య క్రిమినల్ విచారణకు దారితీసినప్పుడు ప్రజా వేదిక బెదిరింపులకు గురయ్యే అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష నాయకులు, ప్రతి సామాన్య పౌరులు సైతం క్రిమినల్ కేసులకు / విచారణలకు నిరంతరం భయపడకుండా, అధికారంలో ఉన్నవారిని ధైర్యంగా ప్రశ్నించగలగాలి, సంస్థలను విమర్శించగలగాలి. ప్రజాదరణ లేని భిన్నమైన అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేయగలగాలి. ప్రజాస్వామ్యంలో విమర్శలను నేరపూరిత తప్పుల నుండి వేరుగా చూడాలి. లేకపోతే ఇటువంటి అనవసరమైన విచారణలు ప్రజలను న్యాయ వ్యవస్థపై, ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసం కోల్పోయేలా కూడా చేయవచ్చు. ప్రజాస్వామ్యానికి జవాబుదారీతనం అవసరం. అలాగే ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించడంలో కూడా సంయమనం పాటించాలి. ఇబ్బందికరమైన వ్యాఖ్యలను ఎంత సమర్థవంతంగా అణచివేస్తుందనే దాని ద్వారా కాకుండా, భిన్నాభిప్రాయాలను ఎంత ధైర్యంగా అనుమతిస్తుందనే దానిపై ప్రజాస్వామ్యబలం ఆధారపడి ఉంటుంది.
- శ్రీకాంత్ చింతల
తెలంగాణ హైకోర్టు
న్యాయవాది
- కంచ ఐలయ్య షఫర్డ్
సోషల్ యాక్టివిస్ట్, రచయిత
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
[email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
