న్యూఢిల్లీ: విదేశీ బ్యాంకుల్లో దాచిన మన బంగారాన్ని ఆర్‌బీఐ వేగంగా స్వదేశానికి తీసుకొస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య ఆరు నెలల్లో సుమారు 60 టన్నుల బంగారాన్ని తరలించింది. దీంతో ఆర్‌బీఐ వద్ద ఉన్న మొత్తం బంగారం నిల్వల్లో 84.06 శాతం ఇప్పుడు మన దేశంలోనే భద్రంగా ఉంది.
2026 సెప్టెంబర్ 30 నాటికి ఆర్‌బీఐ వద్ద మొత్తం 880.52 టన్నుల బంగారం ఉంది. ఇందులో 740.13 టన్నులు భారత్‌లో ఉండగా, 140.39 టన్నులు బ్రిటన్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్ (బీఐఎస్) వద్ద ఉన్నాయి. 2021 మార్చిలో మన దేశంలో కేవలం 42శాతం బంగారం మాత్రమే ఉండేది. విదేశీ బ్యాంకులపై ఆధారపడటాన్ని తగ్గించి, ప్రపంచ ఆర్థిక ఒడిదుడుకుల సమయంలో మన బంగారంపై మనకు పూర్తి నియంత్రణ ఉండేందుకు ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రపంచంలో అత్యధిక బంగారం నిల్వలు ఉన్న దేశాల్లో భారత్ 8వ స్థానంలో కొనసాగుతోంది. 8,133 టన్నులతో అమెరికా మొదటి ప్లేస్‌లో ఉంది. జర్మనీ (3,349 టన్నులు), ఇటలీ (2,452 టన్నులు), ఫ్రాన్స్ (2,437 టన్నులు), చైనా (2,410 టన్నులు), రష్యా (2,264 టన్నులు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి.
