పెళ్లి ప్రపోజల్‌లో ఊహించని ట్విస్ట్.. బీచ్ లో 4 క్యారెట్ల డైమండ్ రింగ్ గల్లంతు

పెళ్లి ప్రపోజల్‌లో ఊహించని ట్విస్ట్.. బీచ్ లో 4 క్యారెట్ల డైమండ్ రింగ్ గల్లంతు

ప్రేమించిన అమ్మాయికి జీవితాంతం గుర్తుండిపోయేలా ప్రపోజ్ చేయాలని అనుకున్నాడో యువకుడు. అందుకోసం అందమైన సూర్యాస్తమయ వేళ బీచ్‌ను ఎంచుకున్నాడు. అనుకున్నట్లుగానే ప్రియురాలికి నిశ్చితార్థపు ఉంగరం చూపించి ప్రపోజ్ చేశాడు. అయితే ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఒక్కసారిగా వచ్చిన భారీ సముద్రపు అల వారి జీవితంలో ఊహించని సంఘటనకు కారణమైంది. ఏకంగా 4 క్యారెట్ల డైమండ్ ఎంగేజ్‌మెంట్ రింగ్ సముద్రంలో గల్లంతైంది.

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ క్లెమెంటేలో ఉన్న కలాఫియా స్టేట్ బీచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. జేస్ హారిక్ (Jace Harrick) తన ప్రియురాలికి సూర్యాస్తమయ సమయంలో ప్రపోజ్ చేశాడు. అయితే ప్రపోజల్ జరిగిన కొద్దిసేపటికే భారీ అలలు వారివైపు దూసుకొచ్చాయి. అప్పటికే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుండటంతో తన కాబోయే భార్యను అలల నుంచి కాపాడేందుకు జేస్ వెంటనే ఆమెను పైకి ఎత్తుకున్నాడు. అదే సమయంలో అతడి చేతిలో ఉన్న ఉంగరం పెట్టెపై పట్టు తప్పింది. దీంతో అది నీటిలో పడిపోయి, మోకాళ్ల లోతు ఉన్న సముద్రపు అలల్లో కొట్టుకుపోయింది.

మొదట పరిస్థితి అదుపులోనే ఉందని భావించిన జేస్.. తన ప్రియురాలిని సురక్షితంగా ఉంచడమే ముఖ్యమని అనుకున్నాడు. వారి ఫోన్లు, పర్సు, తాళాలను కూడా తన వద్ద ఉంచుకున్నాడు. అయితే కొద్దిసేపటికే ఎంతో విలువైన నిశ్చితార్థపు ఉంగరం కనిపించకుండా పోయిందని గుర్తించడంతో ఆ జంట తీవ్ర ఆందోళనకు గురైంది.

బీచ్‌లో ఉంగరం కోసం గాలింపు..

ఉంగరం పెట్టె ఎక్కడైనా ఒడ్డుకు కొట్టుకొస్తుందేమోనని ఆ జంటతో పాటు బీచ్‌లో ఉన్న మరికొందరు వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో జెస్సికా లికాన్ అనే మహిళ తన కుటుంబంతో కలిసి అక్కడ ఉన్నప్పుడు జరిగిన గందరగోళాన్ని గుర్తుచేసుకుంది. మొదట చుట్టుపక్కల వారు పెళ్లి ప్రపోజల్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నారని ఆమె భర్త భావించాడట. కానీ అసలు విషయం తెలిసిన తర్వాత ఉంగరం కోసం వెతకడంలో వారు కూడా భాగమయ్యారు.మెటల్ డిటెక్టర్లతో నిధుల కోసం వెతికే కొందరు వ్యక్తులు సైతం రంగంలోకి దిగారు. బీచ్ ఇసుకలో, నీటి సమీపంలో చాలాసేపు వెతికినా ఉంగరం మాత్రం దొరకలేదు.

జీవితంలో అత్యుత్తమమైన.. అత్యంత క్రూరమైన క్షణం!

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను జేస్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. తన జీవితంలో ఇది అత్యుత్తమమైన, అదే సమయంలో అత్యంత క్రూరమైన క్షణమని పేర్కొన్నాడు. ప్రకృతి మాతా.. దయచేసి మా ఉంగరాన్ని తిరిగి ఇచ్చేయ్. స్కూబా డైవర్లు వస్తున్నారు అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు.

అయితే ఉంగరం పోయిందనే బాధ కంటే తన కాబోయే భార్య సురక్షితంగా ఉండటమే ముఖ్యమని జేస్ తెలిపాడు. అవసరమైతే మరో ఉంగరాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని  చెప్పాడు. ఆమె క్షేమంగా ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉందని, అదే తనకు ముఖ్యమని తెలిపాడు.

ALSO READ : రష్యా అధ్యక్షుడిని ఫిదా చేసిన ఏఐ కిడ్..

మరోవైపు, సముద్రంలో ఉంగరం కోసం గాలించేందుకు ఓ డైవర్ స్వచ్ఛందంగా ముందుకొచ్చాడు. దీంతో ఉంగరం తిరిగి దొరుకుతుందనే ఆశ ఆ జంటలో ఇంకా మిగిలి ఉంది. ఉంగరాన్ని కనుగొన్న వారికి తగిన బహుమతి అందిస్తానని కూడా జేస్ ప్రకటించాడు.

ఒకవైపు జీవితంలో మర్చిపోలేని ప్రపోజల్.. మరోవైపు క్షణాల్లోనే సముద్రంలో కలిసిపోయిన ఖరీదైన ఉంగరం. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.