డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదింపజేసేందుకు ఎండీఏ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రాంతీయ పార్టీల మద్ధతు కీలకంగా మారిన క్రమంలో బిల్లుకు వైసీపీ మద్ధతు ఇచ్చేందుకు సిగ్నలిచ్చింది. ఈ బిల్లుతో ముడిపడిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు జగన్ నేతృత్వంలోని వైసీపీ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. డీఎంకే, ఎన్సీపీ (ఎస్పీ) పార్టీలు మాత్రం బిల్లు పూర్తి వివరాలు చూశాకే తమ నిర్ణయం చెబుతామని ప్రకటించాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఉన్న క్రమంలో ఈ ప్రాంతీయ పార్టీల మద్ధతు కీలకంగా మారనుంది.
బిల్లుకు మద్ధతు ఇవ్వాలంటే ఒక కండిషన్ పెట్టింది వైసీపీ. ప్రాంతీయ సమతుల్యత దెబ్బతినకుండా ఉంటే తాము పునర్విభజన బిల్లుకు మద్దతు ఇస్తామని వైసీపీ వర్గాలు ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపాయి. ఏప్రిల్లో జరిగిన ప్రయత్నం విఫలం కావడంతో, ఈ రాజ్యాంగ సవరణను ఆమోదించుకోవడానికి అవసరమైన సంఖ్యా బలాన్ని కూడగట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
బిల్లు వివరాలను పరిశీలించాకే నిర్ణయం
డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఎలాంగోవన్ స్పందిస్తూ, ప్రభుత్వం ప్రవేశపెట్టే కొత్త చట్టాన్ని ముందుగా పరిశీలిస్తామని చెప్పారు. గతంలో తాము ఈ బిల్లును వ్యతిరేకించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కొత్త బిల్లులో తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటే అంగీకరిస్తామని, లేదంటే రాష్ట్రాల ప్రయోజనాల ప్రాతిపదికన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణ రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందనే ఆందోళన డీఎంకే వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా తమిళనాడుకు ఉన్న లోక్సభ సీట్ల వాటా తగ్గకుండా రాజ్యాంగపరమైన హామీ ఇవ్వాలని ఆ పార్టీ గతంలోనే కోరింది.
ఎన్సీపీ (ఎస్పీ) వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ సుప్రియ సూలే కూడా ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. బిల్లును ముందుగా పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని, పూర్తి పాఠం తమ చేతికి వచ్చాక చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దేశ ప్రయోజనాల కోసం గతంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
2026 నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఇందులో మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన సవరణలను ప్రభుత్వం తీసుకువచ్చే అవకాశం ఉంది. లోక్సభ నవంబర్ 30న, రాజ్యసభ డిసెంబర్ 2న ప్రారంభం అవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు.
బిల్లులు గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తుండటంతో.. ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ సి పి రాధాకృష్ణన్లను ప్రభుత్వం కోరింది. ఆగస్టు 13న వాయిదా పడిన వర్షాకాల సమావేశాల పొడిగింపుగానే ఈ సమావేశాలు జరగనున్నాయి. శుక్రవారం జరగనున్న కేంద్ర క్యాబినెట్ భేటీలో ఈ ప్రతిపాదనపై చర్చ జరిగే అవకాశం ఉంది.
గతంలో విఫలమైన బిల్లు
గత ఏప్రిల్లో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్సభలో అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లభించలేదు. దీంతో ఆ బిల్లుతో పాటు పునర్విభజన బిల్లు కూడా ఆగిపోయింది. లోక్సభ స్థానాలను 543 నుంచి 850కి పెంచడం, 2029 ఎన్నికల నాటికి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం.
గురువారం ప్రచురితమైన ఒక వ్యాసంలో ప్రధాని మోదీ స్పందిస్తూ, మహిళా శక్తికి న్యాయం జరగకుండా ఏ శక్తీ ఆపలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఒక కొత్త ఫార్ములాను పరిశీలిస్తోంది. రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్య నిష్పత్తి మారకుండా, అన్ని రాష్ట్రాల్లో లోక్సభ సీట్లను 50 శాతం పెంచే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. రాజ్యాంగ సవరణకు పార్లమెంట్లో ప్రత్యేక మెజారిటీ అవసరం కాబట్టి ఎన్డీయేతర పార్టీల మద్దతు ప్రభుత్వానికి కీలకం కానుంది.
