ముంబై, వెలుగు: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ప్రశంసలు కురిపించారు. యోగి సమర్థవంతమైన నాయకుడని, హిందుత్వకు ఆయనే అతిపెద్ద ముఖమని అన్నారు. 2027 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో సంజయ్ రౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
హిందుత్వ ముఖచిత్రంగా యోగి ఆదిత్యనాథ్ అందరికంటే ముందుంటారని సంజయ్ రౌత్ తెలిపారు. యోగి ఉంటేనే యూపీ ఉంటుందని, ఆయన లేకపోతే యూపీ లేదని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఆయనను సీఎం అభ్యర్థిగా మళ్లీ ప్రకటిస్తే అది అభినందించదగ్గ విషయమని అన్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు తనకే మద్దతు ఇస్తారనే నమ్మకం యోగిలో కనిపిస్తోందని రౌత్ చెప్పారు.
నాయకత్వ వివాదం
యూపీ బీజేపీలో నాయకత్వంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2027 ఎన్నికల తర్వాత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలే తమ నాయకుడిని ఎన్నుకుంటారని డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ.. సీఎం అభ్యర్థి ఎవరనే విషయం అందరికీ తెలుసని స్పష్టం చేశారు.ఎన్నికల ప్రచారంలో కమలం గుర్తే తమ ముఖమని కేశవ్ ప్రసాద్ మౌర్య తెలిపారు. కేంద్ర పరిశీలకుల సమక్షంలో ఎమ్మెల్యేలు సమావేశమై తమ నాయకుడిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారని చెప్పారు. ప్రస్తుతానికి యోగి ఆదిత్యనాథ్ సీఎం అని, అయితే 2027 తర్వాత ఎవరు ఉంటారనేది ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారని మౌర్య అన్నారు. ఇదే సమయంలో యోగికి తన మద్దతు ఉంటుందని ఆయన వెల్లడించారు.
గత ఎన్నికల సరళి
2017, 2022 యూపీ ఎన్నికల్లోనూ బీజేపీ ముందుగా సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. 2017లో విజయం సాధించిన వారం తర్వాత యోగి పేరును ఎమ్మెల్యేలు ఖరారు చేశారు. 2022లో కూడా 255 సీట్లు గెలిచిన తర్వాత మార్చి 24న ఎమ్మెల్యేలు ఆయనను నాయకుడిగా ఎన్నుకున్నారు. మరుసటి రోజే యోగి రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 2027 ఎన్నికల విషయంలోనూ బీజేపీ తన పాత పద్ధతినే అనుసరించే అవకాశం ఉంది. ఇప్పటివరకు పార్టీ నాయకత్వం నుంచి సీఎం అభ్యర్థిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
