సాఫ్ట్వేర్ రంగంలో ఏఐ వాడకాన్ని పెంచేందుకు వీలుగా దాదాపు 10 వేల ఉద్యోగాలను తొలగించడానికి యూరోపియన్ టెక్ దిగ్గజం SAP ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఈ నిర్ణయం అమలైతే కంపెనీలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో 9 శాతం మందిపై ప్రభావం పడనుంది. ఎంత మంది ఉద్యోగాలను లేఆఫ్ చేయాలనే నంబర్ ప్రస్తుతానికి ఇంకా ఖరారు కాలేదని, కార్మిక సంఘాలతో చర్చల తర్వాత మార్పులు ఉండవచ్చని సమాచారం.
అన్ని విభాగాల్లో ఉద్యోగాల కోతకు అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించాలని మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ హెడ్ లను కోరింది. ముఖ్యంగా ప్రొడక్ట్, ఇంజనీరింగ్, సేల్స్ విభాగాలపై దృష్టి పెట్టారు. ఉత్పత్తుల తయారీ, అమ్మకాల విధానాన్ని మార్చాలని SAP నాయకత్వం భావిస్తోంది. సీఈఓ క్రిస్టియన్ క్లైన్ తన సంస్థ అప్లికేషన్లలో ఏఐ టూల్స్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. సంస్థ వ్యూహం, కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు తీసుకొస్తున్నట్లు కంపెనీ చెబుతోంది.
SAPలో గత ఏడాది కాలంగా కీలక మార్పులు జరుగుతున్నాయి. క్రిస్టియన్ క్లైన్ ఏఐకి ప్రాధాన్యత ఇస్తుండటంతో ఎగ్జిక్యూటివ్ బోర్డులో మార్పులు జరిగాయి. ఆరుగురు బోర్డు సభ్యుల్లో ఇద్దరు వచ్చే ఏడాది మార్చిలో సంస్థ నుంచి తప్పుకోనున్నారు. ప్రొడక్ట్ చీఫ్ మహ్మద్ ఆలం పదవీకాలం మార్చిలో ముగియనుంది. ఆయన కాంట్రాక్టును పునరుద్ధరించకపోవడంతో క్లైన్ ఆ బాధ్యతలు చేపట్టారు. సేల్స్ హెడ్ థామస్ సౌరెసిగ్ అయోనోస్ గ్రూప్ ఎస్ఈ సీఈఓగా వెళ్లేందుకు రాజీనామా చేశారు.
ఎస్ఏపీ సాధారణంగా జనవరిలో వార్షిక ఫలితాలతో పాటు భారీ రీస్టక్చరింగ్ ప్లాన్స్ ప్రకటిస్తుంది. 2024లో చేపట్టిన లేఆఫ్స్ లో దాదాపు 10 వేల ఉద్యోగాలను తొలగించారు. మొదట 8 వేల మందిని తొలగిస్తామని చెప్పిన సంస్థ.. ఆ తర్వాత ఆ సంఖ్యను పెంచింది. దీని కోసం సంస్థ 3 బిలియన్ యూరోలు ఖర్చు చేసింది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలో లక్షా 10వేల మందికి పైగా సిబ్బంది ఉన్నారు.
కంపెనీ ఏఐ దిశగా అడుగులు వేసేందుకు ప్లాన్ చేస్తున్నందున కొత్త రికూర్ట్మెంట్స్ నెమ్మదించే అవకాశం ఉందని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ డొమినిక్ ఆసం గత వారం మోర్గాన్ స్టాన్లీ కాన్ఫరెన్స్లో సూచించారు. పూర్తి వివరాలను జనవరిలో వార్షిక ఫలితాల సమయంలో వెల్లడించనున్నారు. మెుత్తానికి శాప్ లాంటి పెద్దపెద్ద కంపెనీలు కూడా మార్కెట్లో పోటీని తట్టుకుని తమ బిజినెస్ ఖర్చులు తగ్గించుకునేందుకు ఏఐ బాట పడుతున్నాయి. ఇది వేల మంది ఉద్యోగుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చేస్తోందన్నది వాస్తవం.
