- మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య
- పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ సందర్శన
హైదరాబాద్, వెలుగు : దేశంలో ఎరువుల సబ్సిడీ భారాన్ని తగ్గించేందుకు పౌల్ట్రీ లిట్టర్‌ను (వ్యర్థాలు) సేంద్రియ ఎరువుగా వినియోగించాలని పౌల్ట్రీ లెజెండ్ ఆఫ్ ఇండియా అవార్డు గ్రహీత పొన్నాల లక్ష్మయ్య సూచించారు. పౌల్ట్రీ ఫారాల్లో ఏటా ఉత్పత్తయ్యే 796 లక్షల టన్నుల ఎండిన లిట్టర్‌ను సమర్థంగా వినియోగిస్తే, యూరియా సబ్సిడీలో రూ.47,760 కోట్ల వరకు ఆదా చేసే అవకాశం ఉందన్నారు.
కొత్త యూరియా కర్మాగారాల నిర్మాణానికి అవసరమయ్యే పెట్టుబడిని కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం రూ.86,400 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేశారు. 18వ పౌల్ట్రీ ఇండియా ప్రదర్శన సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
పౌల్ట్రీ లిట్టర్‌ను వ్యర్థంగా కాకుండా విలువైన సేంద్రియ ఎరువుగా గుర్తించి జాతీయ పంట పోషక నిర్వహణ విధానాల్లో భాగం చేయాలని కోరారు. లిట్టర్ శుద్ధి, గుళికల తయారీ, రైతులకు సరఫరా వంటి అంశాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించాలని సూచించారు. ఈ క్రమంలో పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్, ట్రెజరర్, ఎం శ్రీకాంత్, సెక్రటరీ నటరాజన్ పాల్గొన్నారు
