హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అబార్షన్ కిట్లను అక్రమంగా విక్రయిస్తున్న 138 మెడికల్ షాపులకు తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎంటీపీ కిట్ల లావాదేవీల డేటా ఆధారంగా గురువారం చేపట్టిన ఈ డేటా-డ్రివెన్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ లో, షెడ్యూల్ హెచ్ కిందకు వచ్చే మిఫెప్రిస్టోన్, మిసోప్రోస్టోల్ వంటి అబార్టిఫేషియంట్ డ్రగ్స్ అమ్మకాల్లో పలు అవకతవకలను అధికారులు గుర్తించారు.
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మడం, బిల్లులు ఇవ్వకపోవడం, సేల్స్ బిల్లుల కాపీలు సరిగ్గా నిర్వహించకపోవడం, చూపించలేకపోవడం, రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ లేకుండానే కిట్లు ఇవ్వడం, ప్రిస్క్రిప్షన్ డ్రగ్ రిజిస్టర్లు నిర్వహించకపోవడం వంటి డ్రగ్స్ నిబంధనల ఉల్లంఘనలు తనిఖీల్లో బయటపడ్డాయి. దాంతో 138 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన టీజీ సేఫ్.. రూల్స్ ప్రకారం వాటి డ్రగ్ లైసెన్సుల సస్పెన్షన్ లేదా రద్దు చర్యలు చేపట్టనున్నట్లు కమిషనర్ స్పష్టం చేశారు.అబార్షన్ కిట్లను కచ్చితంగా క్లినికల్ టెస్టు, అల్ట్రాసౌండ్ అనంతరం రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టిషనర్ పర్యవేక్షణలోనే వాడాలని టీజీ సేఫ్ సూచించింది.
