- పాలు కొనే విషయంలో మిగతా సిటీలతో పోలిస్తే మనోళ్లే ముందు
- పాలను టీ, కాఫీ రూపంలో తీసుకుంటున్నోళ్లు 55శాతం
- అధిక ప్రొటీన్ మిల్క్ తాగుతున్నది 19 శాతమే
- 45 శాతం మందికి పాలు సంపూర్ణ ఆహారం అని తెల్వదు
- గోద్రెజ్ జెర్సీ లాక్టోగ్రాఫ్ 2.0 నివేదికలో వెల్లడి
హైదరాబాద్ సిటీ, వెలుగు : దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే పాలు కొనే విషయంలో హైదరాబాద్ ప్రజలు సంప్రదాయ పద్ధతులతో పాటు ఆధునిక పద్ధతులనూ అనుసరిస్తూ ముందున్నారు. రైతుల వద్ద నేరుగా పాలు కొనుగోలు చేయడంతో పాటు సబ్‌స్క్రిప్షన్ యాప్‌ల ద్వారా ఇంటికే తెప్పించుకుంటున్నారు.
జాతీయ పాల దినోత్సవం సందర్భంగా, గోద్రెజ్ జెర్సీ సంస్థ లాక్టోగ్రాఫ్ 2.0లో ఈ వివరాలు వెల్లడించింది. యూగవ్ అనే సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో భారతదేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలలో పాల ఉత్పత్తుల వినియోగ అలవాట్లను పరిశీలించింది. అందులో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
సర్వే నిర్వహించిన ప్రధాన నగరాలన్నింటిలోకెల్లా అత్యధికంగా 38 శాతం మంది నగరవాసులు నేరుగా పాడి రైతుల దగ్గరికే వెళ్లి పాలను కొంటుండగా.. 34 శాతం మంది సబ్‌స్క్రిప్షన్ యాప్‌ల ద్వారా పాలను ఇండ్లకే తెప్పించుకుంటున్నారు.
అయితే, ఇతర నగరాలలో కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లు, లేదా స్థానిక పాల బూత్‌ల ద్వారా తెప్పించుకుంటున్నారు. అక్కడి సగటు 22 శాతంతో పోలిస్తే మన నగరంలో రెండు రకాల పద్ధతుల్లోనే ఎక్కువగా పాలను కొంటున్నారు.
టీ, కాఫీలతోనే సరి...ప్రొటీన్ఎలా మరి?
హైదరాబాద్ వినియోగదారుల్లో 55 శాతం మంది ప్రతిరోజూ టీ లేదా కాఫీ రూపంలో పాలను తీసుకుంటున్నారని సర్వేలో తేలింది. అయితే, ఒక కప్పు టీ లేదా కాఫీలో వాడే పాల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. అంటే సుమారు 50–100 మి.లీ మాత్రమే. దీనివల్ల శరీరానికి కావాల్సిన పూర్తి స్థాయి ప్రోటీన్ అందడం లేదు. అలాగే, రోజువారీ ప్రోటీన్ వనరుగా ఉపయోగించుకోవడానికి పాలు అందరికీ అందుబాటు ధరలోనే ఉన్నాయని 61 శాతం మంది అభిప్రాయపడ్డారు.
మన శరీరం స్వయంగా తయారు చేసుకోలేని తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలు పాలలోనే ఉంటాయి. అందుకే దీనిని సంపూర్ణ ప్రోటీన్ అని పిలుస్తారు. అయితే, హైదరాబాద్‌లో కేవలం 55 శాతం మందికి ఈ విషయం తెలుసు. మిగిలిన 45 శాతం మందికి తాము రోజూ తాగే పాలలో ఇంతటి విలువైన పోషకాలు ఉన్నాయని పూర్తిగా తెలియదు.
మిగిలిన నగరాలలో ఈ విషయం తెలిసిన వారి సంఖ్య 59 శాతంగా ఉంది. ఎక్కువ ప్రొటీన్ఉండే పాలను ప్రస్తుతం 19 శాతం మంది మాత్రమే క్రమం తప్పకుండా తీసుకుంటుండగా, 39 శాతం మంది వీటి గురించి విన్నప్పటికీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ట్రై చేయలేదు.
