- నవంబర్ 27న సుదర్శన హోమంలో పాల్గొననున్న సీఎం సతీమణి,
చిన్న జీయర్ స్వామి
భద్రాద్రికొత్తగూడెం/ పాల్వంచ, వెలుగు: ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని నవభారత్ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నవభారత్ లిమిటెడ్ చైర్మన్ దేవినేని అశోక్ కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు చంద్రబాబు దంపతులు జిల్లాకు వచ్చినట్లు తెలిసింది. తిరుపతి నుంచి హెలికాప్టర్లో పాల్వంచ కలెక్టరేట్ ప్రాంగణంలోని హెలిప్యాడ్‌కు చేరుకున్న వారికి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, తెల్లం వెంకట్రావు, రాందాస్ నాయక్ తదితరులు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల సీతారాముల జ్ఞాపికను చంద్రబాబు దంపతులకు అందజేశారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి నవభారత్‌లోని వేంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న చంద్రబాబు దంపతులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం చంద్రబాబు హెలికాప్టర్లో విజయవాడకు తిరుగు ప్రయాణమయ్యారు.
కాగా, నారా భువనేశ్వరి శుక్రవారం త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించనున్న సుదర్శన హోమంలో పాల్గొననున్నారు. ఇందుకోసం ఆమె రెండు రోజుల పాటు జిల్లాలో ఉండనున్నట్లు సమాచారం. దేవినేని రమ, భువనేశ్వరి మధ్య ఉన్న స్నేహం నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.
మరోవైపు చంద్రబాబును కలిసేందుకు వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలకు అవకాశం కల్పించకపోవడంతో కొందరు హెలిప్యాడ్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని సముదాయించారు.
ఇదిలా ఉండగా, ఏపీలో విలీనం చేసిన ఎనిమిది పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చంద్రబాబుకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో కొత్తగూడెం, భద్రాచలం, వైరా ఎమ్మెల్యేలతో పాటు భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఐటీడీఏ పీవో రాహుల్, అడిషనల్ కలెక్టర్ డి.వేణుగోపాల్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
