- మూడు నెలల్లో 34.4 లక్షల వీడియోలు తొలగింపు
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌లో భారత్ నుంచి అప్‌లోడ్ అయిన వీడియోలే అత్యధికంగా డిలీట్ అవుతున్నాయి. కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఉల్లంఘించాయనే కారణంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మధ్య భారత్ నుంచి అప్‌లోడ్ అయిన 34.4 లక్షల వీడియోలను యూట్యూబ్ తొలగించింది. ప్రపంచంలో మరే దేశం నుంచీ ఇన్ని వీడియోలు తొలగించలేదు.
ముందటి త్రైమాసికంతో పోలిస్తే ఇది 28 శాతం ఎక్కువ. ఈ 3 నెలల్లో యూట్యూబ్ ప్రపంచవ్యాప్తంగా 1.1 కోట్ల వీడియోలను తొలగించగా, ప్రతి 100 వీడియోల్లో దాదాపు 31 భారత్ నుంచి అప్‌లోడ్ అయినవేనని యూట్యూబ్ తాజా ట్రాన్స్‌పరెన్సీ రిపోర్ట్ వెల్లడించింది. 12.4 లక్షల వీడియోలతో అమెరికా రెండో స్థానంలో, 9.2 లక్షలతో ఇండోనేషియా మూడో స్థానంలో ఉన్నాయి.
చిన్నారుల భద్రత వీడియోలే ఎక్కువ
వీడియోలు ఎందుకు తొలగించారో యూట్యూబ్ వెల్లడించలేదు. అప్‌లోడ్ చేసినవారి ఐపీ అడ్రస్ ఆధారంగా ఏ దేశం నుంచి ఎన్ని వీడియోలు తొలగించారో మాత్రమే చెబుతుంది. ప్రపంచవ్యాప్తంగా తొలగించిన వీడియోల్లో 68.2% పిల్లల భద్రతకు సంబంధించిన రూల్స్ ఉల్లంఘనలే. తొలగించిన వీడియోల్లో 98.6 శాతాన్ని మొదట గుర్తించింది ఆటోమేటెడ్ వ్యవస్థలే. కంటెంట్ నిఘాలో ఏఐ పాత్ర ఎంతగా పెరిగిందో ఇది చెబుతోంది.
పోలీసుల నుంచే 72 శాతం రిక్వెస్టులు
కోర్టులు, ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చే కంటెంట్ తొలగింపు డిమాండ్లలోనూ యూట్యూబ్‌పైనే ఎక్కువ ప్రభావం కనిపిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య భారత్ నుంచి గూగుల్‌కు 4,006 రిక్వెస్టులు రాగా, వాటిలో 3,399 యూట్యూబ్‌కు సంబంధించినవే. ముందటి 6 నెలలతో పోలిస్తే రిక్వెస్టులు 61% పెరిగాయి. రష్యా, దక్షిణ కొరియా మాత్రమే భారత్ కన్నా ఎక్కువ రిక్వెస్టులు పంపాయి. భారత్ నుంచి వచ్చిన 4,006 రిక్వెస్టుల్లో 2,870 (దాదాపు 72 శాతం) పోలీసుల నుంచి, 695 కోర్టుల నుంచి వచ్చాయి. 2,130 రిక్వెస్టుల్లో పరువు నష్టాన్ని కారణంగా చూపించారు.
సగానికి పైగా ఫిర్యాదులపై చర్యల్లేవ్
భారత్ నుంచి వచ్చిన రిక్వెస్టులపై స్థానిక చట్టాలు ఉల్లంఘించిన 19,883 ఐటమ్స్‌ను, కంపెనీ నిబంధనలు ఉల్లంఘించిన 1,415 ఐటమ్స్‌ను గూగుల్ తొలగించింది. 19,402 ఐటమ్స్‌పై ఎలాంటి చర్యా తీసుకోలేదు. మరో 17,473 ఐటమ్స్‌పై చర్య తీసుకునేందుకు సరిపడా సమాచారం లేదని తెలిపింది.
