ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ జోనల్  ఆఫీస్ లో భారీ అగ్నిప్రమాదం

ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ జోనల్  ఆఫీస్ లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు కార్యాలయంలోని మూడు అంతస్తులకు వ్యాపించడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం నెలకొంది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో కార్యాలయంలోని పలు ఫైల్స్, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. మంటల కారణంగా కార్యాలయ పరిసర ప్రాంతాలను దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.

అయితే అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, జరిగిన ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. అధికారుల నుంచి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.