పెళ్లిపై నమ్మకం లేని అమ్మాయిల ఆలోచనలతో కొత్త సినిమా

పెళ్లిపై నమ్మకం లేని అమ్మాయిల ఆలోచనలతో కొత్త సినిమా

యువత ఆలోచనలు, ప్రేమ, పెళ్లి చుట్టూ అల్లుకున్న కథతో తెరకెక్కిన చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్’.  సుగి విజయ్, జుప్సీ భద్ర జంటగా  నటించిన ఈ చిత్రానికి పరమేష్ రేణుకుంట్ల దర్శకత్వం వహించాడు.  మాదం దయానంద్, కార్తీక్ వెంపటి  నిర్మించారు. శుక్రవారం సినిమా విడుదల  కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు పరమేష్ మాట్లాడుతూ ‘ప్రస్తుతం చాలామంది అమ్మాయిలు ప్రేమలో ఉన్నప్పటికీ తల్లిదండ్రులు చూసిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటున్నారు. దీనికి కారణమేంటో తెలుసుకోవడానికి చాలామంది అమ్మాయిలతో మాట్లాడాను.  

పెళ్లిపై ఆసక్తి లేకపోయినా తల్లిదండ్రుల కోసం వివాహం చేసుకుంటున్నామని చెప్పారు.  ఆ ఆలోచనల నుంచే ఈ కథ పుట్టింది. భావోద్వేగాలకు దూరంగా ఉండే అబ్బాయి, తన సరదాలను తీర్చుకోవాలనుకునే అమ్మాయి మధ్య జరిగే కథ ఇది.  అనుకోకుండా ఈ  ఇద్దరూ ప్రేమలో పడితే వారి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయన్నదే సినిమా.  

సమాజంలో ఉన్న వాస్తవాలనే చూపించాం. జెన్‌‌జీ యువత ఆలోచనలు, తల్లిదండ్రుల అభిప్రాయాల మధ్య సంఘర్షణను ఇందులో చూడొచ్చు.  సినిమా నిర్మాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. సుమారు 30 మంది స్నేహితులు, బంధువుల సహకారంతో సినిమాను పూర్తి చేశా’ అని చెప్పాడు.