ప్రపంచ యాత్ర చేసినట్టుగా.. బాల 369

ప్రపంచ యాత్ర చేసినట్టుగా.. బాల 369

ఆర్విన్ తేజ్ హీరోగా ‘జయమ్మ పంచాయితీ’ ఫేమ్  విజయ్ కుమార్ కలివరపు తెరకెక్కించిన చిత్రం ‘బాల 369’. ‘అటజని కంచె’ అనేది ట్యాగ్‌‌లైన్.  నటుడు వైవా హర్ష సమర్పణలో విజయ్ కుమార్ కలివరపు, ఎల్లయ్య నిర్మించారు.  శుక్రవారం సినిమా విడుదల సందర్భంగా గురువారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అతిథిగా హాజరైన హీరో నిఖిల్ సిద్ధార్థ మాట్లాడుతూ ‘ఈ కాన్సెప్ట్ చాలా బ్రిలియంట్‌‌గా ఉంది. తక్కువ బడ్జెట్‌‌లో 15 దేశాల్లో ఈ సినిమాను షూట్ చేయడం మామూలు విషయం కాదు. 

ఆడియన్స్  ప్రపంచ యాత్ర చేయాలంటే థియేటర్‌‌‌‌లో కూర్చుని  ‘బాల 369’ సినిమా చూస్తే సరిపోతుంది. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’ అని చెప్పాడు. ఈ  కథ నచ్చి ప్రెజెంటర్‌‌‌‌గా వ్యవహరిస్తున్నానని,  మన దగ్గర బడ్జెట్ లేకపోయినా గ్రాండ్ విజువల్స్‌‌తో ఎలా తీయెచ్చో కేస్ స్టడీలా ఈ సినిమా ఉంటుందని వైవా హర్ష అన్నాడు.  

ఈ సినిమా చాలా క్రియేటివ్‌‌గా ఉంటుందని, ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు అని  హీరో అర్విన్ తేజ్ అన్నాడు.   డైరెక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ‘అల్లసాని పెద్దన రచించిన ‘మనుచరిత్ర’లోని ‘అటజని కాంచే’ పద్యాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ కథ రాశా. అందరు  తెలుగు ఉపాధ్యాయులకు ఈ చిత్రం అంకితం చేస్తున్నా’ అని చెప్పాడు. నిర్మాత  ఎల్లయ్య సహా టీమ్ అంతా పాల్గొన్నారు.