హైదరాబాద్, వెలుగు: తెలంగాణ దేశవాళీ పశు జాతుల పరిరక్షణ, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని తెలంగాణ లైవ్‌స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ (టీజీఎల్‌డీఏ) చైర్మన్ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో పొడ తూర్పు జాతి పశువులు, దక్కన్ గొర్రెల సంరక్షణ కోసం రూ.20.31 కోట్లతో పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం జీవో నంబర్ 18 జారీ చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఈ నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి కృతజ్ఞతలు తెలిపారు. గత పదేళ్లలో పాలకులు దేశవాళీ పశు సంపద పరిరక్షణ, పశు బ్రీడింగ్, పాడి, మాంస పరిశ్రమల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.100 ఎకరా ల్లో ఏర్పాటు కానున్న ఈ కేంద్రం ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పొడ తూర్పు పశు జాతితో పాటు దక్కనీ గొర్రెల సంతతి పరిరక్షణకు శాస్త్రీయ పరిశోధనలు చేపట్టనున్నట్లు తెలిపారు. కరువు, వ్యాధులను తట్టుకునే సామర్థ్యం కలిగిన పశు జాతుల అభివృద్ధి ద్వారా పశువుల ఉత్పాదకత పెరిగి రాష్ట్రంలో పాడి, గొర్రెల పెంపకం రంగాలు మరింత బలోపేతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
