గిరిజన యువతకు ఉపాధి బాట.. 26 కోర్సులపై ఐటీడీఏల్లో నిపుణులతో శిక్షణ 

గిరిజన యువతకు ఉపాధి బాట.. 26 కోర్సులపై ఐటీడీఏల్లో నిపుణులతో శిక్షణ 
  •     డేటాఎంట్రీ, కస్టమర్ కేర్, బ్యూటీ పార్లర్​తో పాటు పలు కోర్సులు
  •     ఒక్కో ఐటీడీఏ నుంచి 2,400 మందికి ట్రైనింగ్
  •     భద్రాచలం, ఏటూరునాగారం, ఉట్నూరు, మన్ననూరు ఐటీడీఏల్లో శిక్షణ
  •     వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగనున్న తరగతులు


 

హైదరాబాద్, వెలుగు: గిరిజన ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ట్రైబల్ వెల్ఫేర్ శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న గిరిజన యువతీ యువకుల నైపుణ్యాలను పెంచేందుకు ఐటీడీఏల ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఐటీడీఏలతో పాటు అన్ని జిల్లాల్లోనూ నిరుద్యోగ యువతకు ట్రైనింగ్ ఇస్తోంది. ఈ కార్యక్రమాలను ఐటీడీఏలు ఉన్న జిల్లాల కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలు పర్యవేక్షిస్తున్నారు. నిరుద్యోగ యువతకు కోర్సులపై ఉన్నతాధికారులు కూడా 
అవగాహన కల్పిస్తున్నారు.

ఉపాధి కోర్సులతో ట్రైనింగ్..

ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా, త్వరగా ఉపాధి లభించేలా మొత్తం 26 రకాల కోర్సులను ట్రైబల్ శాఖ ఎంపిక చేసింది. ఇందులో సంప్రదాయ కోర్సులతో పాటు ఆధునిక సాంకేతికతకు సంబంధించిన కోర్సులు ఉన్నాయి. డ్రోన్ ఆపరేటింగ్ (డ్రోన్ పైలట్), డేటా ఎంట్రీ ఆపరేటర్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, బ్యూటీ పార్లర్ మేనేజ్‌మెంట్, కొరియర్, ఐటీ హెల్ప్ డెస్క్, గోట్, షీప్ ఫార్మర్, గెస్ట్ సర్వీస్, సాఫ్ట్‌వేర్ డెవలపర్, కిచెన్, హోటల్ మేనేజ్‌మెంట్, మల్టీ స్కిల్, వర్మీ కంపోస్ట్, వేర్‌హౌస్ సూపర్‌వైజర్ తదితర 26 విభాగాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఆయా రంగాల్లో అనుభవం ఉన్న నిపుణుల ఆధ్వర్యంలో యువతకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందేలా తర్ఫీదు ఇస్తున్నారు. 

నాలుగు ఐటీడీఏలు.. 9,600 మందికి శిక్షణ.. 

రాష్ట్రంలోని ప్రధాన ఐటీడీఏలైన భద్రాచలం, ఏటూరునాగారం, ఉట్నూరు, మన్ననూరు కేంద్రంగా ఈ శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఒక్కో ఐటీడీఏ పరిధిలో 2,400 మంది నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లెక్కన నాలుగు ఐటీడీఏల పరిధిలో మొత్తం 9,600 మంది గిరిజన యువతీ యువకులు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందనున్నారు. వీరికి ప్రభుత్వం ఉచిత వసతి, భోజనం అందిస్తోంది. నాన్ ఐటీడీఏ ఏరియాలైన అన్ని జిల్లాల నుంచి మరో 2,400 మందికి కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఐటీడీఏ (ప్లెయిన్) ఏరియాల్లో ఇప్పటి వరకు 1,450 మంది శిక్షణకు హాజరవుతున్నట్లు ట్రైబల్ శాఖ అధికారులు చెబుతున్నారు. 

మార్చి వరకు కొనసాగనున్న తరగతులు.. 

ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ప్రత్యేక శిక్షణ తరగతులు వచ్చే ఏడాది మార్చి వరకు నిరంతరాయంగా కొనసాగనున్నాయి. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందించడంతో పాటు వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించేందుకు (ప్లేస్‌మెంట్స్), స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించుకునేందుకు అధికారులు తోడ్పాటు అందించనున్నారు. గిరిజన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారులు సూచిస్తున్నారు.  

గిరిజన యువతకు అవగాహన కల్పించి ట్రైనింగ్ ఇస్తున్నాం..

ట్రైబల్ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఐటీడీఏల్లో 26 కోర్సుల్లో స్కిల్ ట్రైనింగ్ ఇస్తున్నాం. 65 రోజుల నుంచి ఆరు నెలల వరకు కోర్సులు ఉన్నాయి. భద్రాచలం పరిధిలో 2,700 మందికి శిక్షణ ఇస్తున్నాం. ఇప్పటికే వెయ్యి మందికి పూర్తయింది. వంద మందికి ఉద్యోగాలు వచ్చాయి. కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని గిరిజన గ్రామాలు, తండాల్లో కోఆర్డినేటర్లు పర్యటిస్తూ ట్రైనింగ్‌పై అవగాహన కల్పిస్తున్నారు. స్కిల్ ట్రైనింగ్ కోర్సుల వివరాలు చెబుతూ యువతను శిక్షణకు వచ్చేలా ప్రోత్సహిస్తున్నాం. ఉచిత వసతి, భోజనం ప్రభుత్వమే భరిస్తుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం.

- శ్రీను, ట్రైనింగ్ కోఆర్డినేటర్,
 భద్రాచలం ఐటీడీఏ