హైదరాబాద్లో చేపల మార్కెట్లపై TG SAFE ఫుడ్ వింగ్ ప్రత్యేక దృష్టి సారించింది. నగరంలోని ప్రధాన చేపల మార్కెట్లలో అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా బేగంబజార్, రామ్నగర్ చేపల మార్కెట్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా చేపల నాణ్యత, తాజాదనంపై అధికారులు ఆరా తీశారు. మార్కెట్లలో విక్రయిస్తున్న చేపలు కుళ్లిపోయాయా? వాటిని సరైన పద్ధతిలో నిల్వ చేస్తున్నారా? మార్కెట్ పరిసరాల్లో పరిశుభ్రత పాటిస్తున్నారా? అనే అంశాలను పరిశీలించారు.
ముఖ్యంగా చేపలు ఎక్కువ రోజులు తాజాగా ఉండేందుకు హానికరమైన రసాయనాలు లేదా అక్రమ ప్రిజర్వేటివ్స్ వినియోగిస్తున్నారా అనే కోణంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రజలకు సురక్షితమైన ఆహారం అందించడమే లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. తనిఖీల్లో గుర్తించిన లోపాలపై అధికారులు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
