కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు : మంత్రి తుమ్మల

కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు : మంత్రి తుమ్మల
  •     మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గురువారం ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో కలెక్టర్ దివాకరతో కలిసి మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రజా ప్రభుత్వం మహిళలు పెళ్లిళ్లు, శుభకార్యాలకు సైతం ధరించేలా నాణ్యమైన చీరలు అందిస్తోందన్నారు.

గత ఏడాది పాలపిట్ట రంగు చీరలు పంపిణీ చేయగా, ఇప్పుడు చిలకపచ్చ రంగు చీరలను అందిస్తున్నట్లు తెలిపారు. ఏటా కొత్త రంగుల్లో చీరలు పంపిణీ చేస్తామన్నారు. నిధుల ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4.50 లక్షల పింఛన్లు మంజూరు చేసి, గురువారమే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసినట్లు వెల్లడించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ చీరలు మహిళా సంఘాల సభ్యుల్లో ఐక్యత, ప్రత్యేక గుర్తింపును పెంపొందిస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో శిక్షణ సహాయ కలెక్టర్ పారస్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ ఖాదర్ బాబా, మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, మెప్మా పీడీ నళినీ పద్మావతి, డీవైఎస్వో సునీల్ రెడ్డి, నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.