- హాజరవనున్న గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
వరంగల్, వెలుగు: ఓరుగల్లు కాకతీయ యూనివర్సిటీలో శనివారం పట్టభద్రుల పట్టాల పంపిణీ నిర్వహించనున్నారు. యూనివర్సిటీ 24వ స్నాతకోత్సవం కావడంతో అధికారులు పనుల్లో నిమగ్నమయ్యారు. కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరకానున్నారు. కేయూ జంక్షన్‍లోని యూనివర్సిటీ ఆడిటోరియం పట్టాల పండుగకు వేదికకానుంది.
91 పీహెచ్‍డీలు.. 408 గోల్డ్ మెడల్స్
కేయూలో 28న నిర్వహించే 24వ స్నాతకోత్సవంలో 2025 జులై నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు ఆర్ట్స్, సైన్సెస్, సోషల్ సైన్స్, ఫార్మసీ, కామర్స్అండ్ బిజినెస్ మేనేజ్‍మెంట్, లా ఎడ్యుకేషన్ విభాగాల్లో పీహెచ్‍డీ పూర్తిచేసిన 91 మంది పట్టభద్రులకు పీహెచ్‍డీ పట్టాలు ప్రదానం చేయనున్నారు. 2021– 22, 22–23, 23–24, 24–25 ఏడాదిల్లో ఆర్ట్స్, సోషల్ సైన్సెస్, ఫార్మసీ, లా, సైన్సెస్, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, కామర్స్అండ్ బిజినెస్ మేనేజ్‍మెంట్, ఎడ్యుకేషన్ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన 408 మంది స్టూడెంట్లకు గోల్డ్మెడల్స్అందజేయనున్నారు.
ఈ కాన్వొకేషన్‌కు ప్రోగ్రామ్‌కు గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా శనివారం హెలికాప్టర్ ద్వారా జిల్లాకు రానున్నారు. ఉదయం 10.30 గంటలకు హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్అండ్ సైన్స్కాలేజీకి చేరుకుంటారు. ఆపై ఫాతిమానగర్‍లోని వరంగల్ ఎన్‍ఐటీకి వెళ్తారు. 11 గంటలకు స్నాతకోత్సవం నిర్వహించే కేయూ ఆడిటోరియానికి చేరుకుంటారు. దాదాపు 12.45 గంటల వరకు పీహెచ్‍డీ పట్టాలను అందజేసే కార్యక్రమంలో పాల్గొంటారు. లంచ్ తర్వాత హైదరాబాద్ తిరిగి వెళ్తారు. కాగా, స్నాతకోత్సవ ఏర్పాట్ల కోసం 151 మంది సభ్యులతో కలిసి స్టీరింగ్, రిసెప్షన్, ఇతరులు కలిపి 12 కమిటీలను ఏర్పాటు చేసినట్లు కేయూ వీసీ కె.ప్రతాప్‍రెడ్డి వెల్లడించారు.
