- ఇతర పార్టీలు ఓట్ల కోసమే వాడుకున్నయి.. కాంగ్రెస్ అవకాశాలిచ్చింది: సీఎం రేవంత్
- ఎస్టీలకు ప్రత్యేక కమిషన్.. చైర్మన్గా లంబాడా బిడ్డని నియమిస్తం
అచ్చంపేట, వెలుగు: లంబాడాలను కొన్ని పార్టీలు ఓటు బ్యాంకుగానే చూశాయని, రాజకీయ అవసరాలకు వాడుకున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వారిని గుర్తించి సమాన అవకాశాలు కల్పించింది ఇందిరాగాంధీ మాత్రమేనని అన్నారు. 1976లో ఎస్టీ జాబితాలో చేర్చడం వల్లే నేడు లంబాడాలు ఐఏఎస్, ఐపీఎస్లుగా, రాజకీయ నాయకులుగా ఎదిగారని, మహారాష్ట్ర సీఎం స్థాయికి చేరుకున్నారని గుర్తుచేశారు. మద్దిమడుగులో రూ.2 కోట్లతో ఆదివాసీ భవన్, మరో రూ.2 కోట్లతో సేవాలాల్ మహారాజ్ విగ్రహం, రూ.18 కోట్లతో పబ్బతి ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి, మన్ననూరులో రూ.14 కోట్లతో ఐటీడీఏ భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ చీరలు, చేయూత పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు. ప్రస్తుతం 16 ఎకరాల్లో నిర్మిస్తున్న సేవాలాల్ ఆలయానికి మరో 4 ఎకరాలు సేకరించి 20 ఎకరాల్లో దేశానికే తలమానికంగా నిర్మిస్తామని ప్రకటించారు. వరంగల్లోనూ మరో ఆలయం కడతామన్నారు.
లంబాడాలది పోరాట చరిత్ర
బ్రిటిష్ పాలకులను ఎదిరించి, నిజాం నవాబుతో పోరాడిన చరిత్ర లంబాడాలదని, నమ్మినవారి కోసం ప్రాణాలిచ్చే తత్వం వారి సొంతమని కొనియాడారు. ఇందిరాగాంధీ దున్నేవాడికే భూమి నినాదంతో 12 లక్షల ఎకరాలు పంచారని, జైపాల్ రెడ్డి చొరవతో లంబాడాలను ఎస్టీల్లో చేర్చారని గుర్తుచేశారు. అందుకే వారి ఇళ్లలో సేవాలాల్తో పాటు ఇందిరమ్మకూ స్థానం ఉందన్నారు. తమ ప్రభుత్వం మంజూరు చేసిన 8 లక్షల ఇందిరమ్మ ఇండ్లలో 4 లక్షల వరకు ఎస్సీ, ఎస్టీలకే అందాయని తెలిపారు. తాను అచ్చంపేట, నల్లమల బిడ్డనని గర్వంగా చెప్పుకుంటానని, వంశీకృష్ణను గెలిపిస్తే అచ్చంపేటకు ఇద్దరు ఎమ్మెల్యేలుంటారని ఇచ్చిన మాట ప్రకారం రూ.450 కోట్ల నిధులు తీసుకొచ్చానని పేర్కొన్నారు. ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి, చైర్మన్గా లంబాడా సోదరుడిని నియమిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
