హైదరాబాద్, వెలుగు: మహాత్మా జ్యోతిబా ఫూలే జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ‘ఫూలే’ సినిమా నేటి సమాజానికి ఆదర్శప్రాయమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ‘ఫూలే’ సినిమా హీరో ప్రతీక్ గాంధీ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఫూలే జీవిత చరిత్రను, సామాజిక ఉద్యమాలను వెండితెరపై ఆవిష్కరించిన చిత్ర బృందాన్ని మంత్రి అభినందించారు. హీరో ప్రతీక్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. కులవివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా జ్యోతిబా ఫూలే పోరాడారని, మహిళా విద్య కోసం విశేష కృషి చేశారని మంత్రి గుర్తుచేశారు.
బాలికల కోసం పాఠశాలల ప్రారంభం, అణగారిన వర్గాల హక్కుల కోసం ఉద్యమం, 1873లో సత్యశోధక సమాజ స్థాపన వంటి చారిత్రాత్మక ఘట్టాలను ఈ సినిమాలో చక్కగా చూపించారని పేర్కొన్నారు. ఫూలే ఆశయాల స్ఫూర్తితోనే తెలంగాణ ప్రభుత్వం బీసీల సంక్షేమం, సామాజిక న్యాయం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని పొన్నం ప్రభాకర్ వివరించారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సినిమాను వీక్షించి చిత్ర బృందాన్ని అభినందించారని వెల్లడించారు.
