పాక్ కంటెంట్కు నో ఎంట్రీ.. నెట్ ఫ్లిక్స్కు కేంద్రం వార్నింగ్

పాక్ కంటెంట్కు నో ఎంట్రీ.. నెట్ ఫ్లిక్స్కు కేంద్రం వార్నింగ్
  • ‘జో బచే హై సంగ్ సమేట్ లో’ సిరీస్​పై వివాదం

న్యూఢిల్లీ: దేశంలో పాకిస్తాన్ కంటెంట్​ను ఎట్టిపరిస్థితుల్లోనూ స్ట్రీమింగ్ చేయకూడదని ఓటీటీ సంస్థ నెట్​ఫ్లిక్స్​కు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సూచించింది. పాక్ నటులు ఫవాద్ ఖాన్, మహీరా ఖాన్ నటించిన వెబ్ సిరీస్ ‘జో బచే హై సంగ్ సమేట్ లో’ ఇండియాలో విడుదల కానుందన్న వార్తలతో ఈ వివాదం చెలరేగింది. దీనిపై పలు ఫిర్యాదులు అందడంతో కేంద్రం రంగంలోకి దిగింది. 2025 పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. 

దీంతో జాతీయ భద్రత దృష్ట్యా పాక్ కంటెంట్​ను నిషేధిస్తూ 2025 మే 8న కేంద్రం అడ్వైజరీ జారీ చేసింది. భారత్​లో పాక్ సినిమాలు, సిరీస్​లను ప్రసారం చేయడం లేదని నెట్​ఫ్లిక్స్ 2025 జూన్‌లో ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. ఇప్పుడు 2026 డిసెంబర్ 4న ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ కానున్నందున, గత హామీకి కట్టుబడి ఉండాలని కేంద్రం తేల్చిచెప్పింది.

  • ప్రధాని మోదీకి సినీ సంఘాల లేఖలు

ఈ సిరీస్​ను నిషేధించాలని కోరుతూ ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ శ్యామ్​లాల్ గుప్తా ఈ నెల 24న ప్రధానికి లేఖ రాశారు. సినిమా హాళ్లు, టీవీ, ఓటీటీలలో పాక్ కళాకారులు, కంటెంట్​పై శాశ్వత నిషేధం విధించేలా చట్టం తేవాలన్నారు. మరుసటి రోజే ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ సైతం ప్రధానికి లేఖ రాస్తూ అభ్యంతరం తెలిపింది. మరోవైపు, సోషల్ మీడియా వ్యతిరేకతతో బెంగళూరులో నిర్వహించాల్సిన ‘దర్-ఎ-నిజాత్’ అనే మరో పాక్ డ్రామా ప్రైవేట్ స్క్రీనింగ్​ను రద్దు చేశారు.