హర్యానాలో గ్యాంగ్ వార్.. నలుగురిపై కాల్పులు

హర్యానాలో గ్యాంగ్ వార్.. నలుగురిపై కాల్పులు
  • కారులో వచ్చి ఐదుగురు దుండగులు విచక్షణారహితంగా  కాల్పులు 
  • ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్ పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో హత్యలకు బాధ్యత వహించిన ‘భావు రితోలియా గ్యాంగ్’

న్యూఢిల్లీ: హర్యానాలోని రోహ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తక్ జిల్లాలో బుధవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. ఐదుగురు సాయుధ దుండగులు కారులో వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో నలుగురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఖరావర్ పోలీస్ పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కేవలం 50 అడుగుల దూరంలోనే ఈ ఘటన జరగడం స్థానికంగా కలకలం రేపింది. రోహ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తక్ జిల్లాలోని మిలన్ దాబా వద్దకు బుధవారం అర్ధరాత్రి స్విఫ్ట్ కారులో వచ్చిన ఐదుగురు దుండగులు, అక్కడ భోజనం చేస్తున్న యువకుల బృందంపై కాల్పులకు తెగబడ్డారు. 

ఈ అటాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముగ్గురు యువకులు భోజనం చేస్తున్న టేబుల్ వద్దే కుప్పకూలగా, ప్రాణభయంతో బయటకు పరుగులు తీసిన నాలుగో యువకుడిని దుండగులు వెంబడించి కాల్చి చంపారు. ఈ దాడిలో సన్నీ రితోలి అనే మరో వ్యక్తి తప్పించుకున్నాడు. కాల్పుల అనంతరం దుండగులు కారులో పరారయ్యారు. మృతులను ఝజ్జర్ జిల్లాకు చెందినవారిగా గుర్తించగా, వీరిలో ముగ్గురు దీఘల్ గ్రామానికి, మరొకరు బేరి ప్రాంతానికి చెందినవారు.  

ఈ హత్యలకు బాధ్యత వహిస్తున్నట్టు ‘రోహిత్ బజరంగ్07’  అనే ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్ ఖాతా నుంచి ‘భావు రితోలియా గ్యాంగ్’ పేరుతో ఒక పోస్ట్ వెలువడింది. ఇది ప్రతీకార చర్య అని పేర్కొంది. హిమాన్షు భావు గ్యాంగ్ సభ్యులు సన్నీ రితోలిని హత్య చేయడానికి రాగా, అతడు తప్పించుకోవడంతో మిగిలిన వారు బలయ్యారని తెలుస్తోంది. భావు, సన్నీ రితోలియా గ్యాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల మధ్య పాత కక్షలే ఈ దాడికి కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.