ముంబై వ్యాప్తంగా బాంబు దాడులు .. 26/11 మళ్లీ రిపీట్ : ఖలిస్తానీ సంస్థల పేరుతో బెదిరింపు మెయిల్

ముంబై వ్యాప్తంగా బాంబు దాడులు .. 26/11 మళ్లీ రిపీట్ : ఖలిస్తానీ సంస్థల పేరుతో బెదిరింపు మెయిల్
  • అమితాబ్ నివాసం 'జల్సా'.. మెట్రో స్టేషన్లే టార్గెట్!
  •  27న జరిగే సింగర్ దిల్జిత్ సంగీత కచేరీని రద్దు చేయాలని డిమాండ్
  •  లేకుంటే ముంబైలో 30 రోజులపాటు గ్రెనేడ్ దాడులు  చేస్తామని వార్నింగ్

ముంబై: మహారాష్ట్రలోని ముంబై నగరానికి మరోసారి బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడం తీవ్ర కలకలం రేపింది. 26/11 ఉగ్రదాడులకు 18 ఏండ్లు పూర్తయిన వేళ గురువారం ఉదయం 10:12 గంటలకు ముంబై మేయర్ రీతూ తావ్డే, బృహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కమిషనర్ అశ్విని భిడే ఆఫీసులకు 'హన్నా మెహ్లర్' అనే పేరుతో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి మెయిల్ వచ్చింది. 2008 నాటి 26/11 దాడులు మళ్లీ పునరావృతమవుతాయని అందులో హెచ్చరించారు. 

ముంబై మేయర్ ఆఫీస్, ఓ కోర్టుతో పాటు బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ (84) నివాసం 'జల్సా'ను పేల్చివేస్తామని బెదిరించారు. వెంటనే అప్రమత్తమైన ముంబై పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. అయితే, తనిఖీల్లో ఎక్కడా అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

30 రోజుల పాటు గ్రెనేడ్ దాడులు చేస్తం.. 

తాము ఖలిస్తానీ వేర్పాటువాద సంస్థలైన బబ్బర్ ఖల్సా, ఖలిస్తాన్ నేషనల్ ఆర్మీకి చెందిన వారమని దుండగులు మెయిల్ లో ప్రస్తావించారు. ఆయా సంస్థలకు చెందిన ఉగ్రవాదులు గ్రెనేడ్లతో ఇప్పటికే ముంబైలోకి ప్రవేశించినట్లు అందులో హెచ్చరించారు. ఈ నెల 27 నుంచి డిసెంబర్ 31 మధ్య మహాలక్ష్మి, సైన్స్, ఆచార్య మెట్రో స్టేషన్లలో ఐఈడీ బాంబు దాడులు జరిగే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా, శుక్రవారం (నవంబర్ 27) జరగనున్న పంజాబీ సింగర్ దిల్జీత్ దోసాంజ్ సంగీత కచేరీ (కాన్సర్ట్)ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 

ఒకవేళ ఆ కార్యక్రమం జరిగితే వేదికపై డ్రోన్లతో దాడి చేయడంతో పాటు నగరమంతా 30 రోజుల పాటు గ్రెనేడ్ దాడులు చేస్తామని బెదిరించారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లను రెచ్చగొట్టారని ఆరోపిస్తూ నటుడు అమితాబ్ బచ్చన్, ఆయనకు పాదాభివందనం చేశాడనే కోపంతో దిల్జీత్ దోసాంజ్ పేర్లను బెదిరింపు మెయిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేర్చారు.

ఇది ఐదోసారి

ముంబై మేయర్ కార్యాలయానికి ఈ ఏడాది బెదిరింపులు రావడం ఇది ఐదోసారి. అక్టోబర్ 23న, అలాగే ఈ నెల ప్రారంభంలోనూ అమితాబ్ బచ్చన్ నివాసం 'జల్సా'కు ఇదే తరహాలో బెదిరింపులు వచ్చాయి. వరుస హెచ్చరికల నేపథ్యంలో అమితాబ్ ఇంటి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దాంతో ఆయన తన అభిమానులను కూడా బుల్లెట్ ప్రూఫ్ అద్దం వెనుక నుండే పలకరించాల్సి వస్తోంది. గతంలో వచ్చిన మెయిల్స్ అన్నీ.. తనిఖీల అనంతరం నకిలీవిగా తేలినప్పటికీ తాజా బెదిరింపును పోలీసులు చాలా సీరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీసుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా నగరంలోని కీలక ప్రాంతాలు, మెట్రో స్టేషన్ల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయో గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.