- డిసెంబర్ 12న భోపాల్, 19న అహ్మదాబాద్, జనవరిలో కోల్‌కతాలో సభలు
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఇండియా కూటమి పోరాటాన్ని ఉధృతం చేస్తోంది. ఢిల్లీకి పరిమితమైన నిరసనలను బీజేపీ పాలిత రాష్ట్రాలకూ విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా డిసెంబర్ 12న భోపాల్‌లో, 19న అహ్మదాబాద్‌లో, జనవరిలో కోల్‌కతాలో భారీ ర్యాలీలు నిర్వహించనుంది. గురువారం కూటమి నేతలు ఈ కార్యాచరణను వెల్లడించారు. ఈ సందర్భంగా టీఎంసీ రాజ్యసభ పక్ష నేత డెరెక్ ఓబ్రియన్ మాట్లాడుతూ ఢిల్లీ తర్వాత బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు.
భోపాల్ ర్యాలీ ఉత్తర భారతదేశం దృష్ట్యా కీలకమని చెప్పారు. ఢిల్లీ వెలుపల కూటమి నిర్వహించనున్న తొలి సభ ఇదే కానుంది. మరోవైపు లక్నోలో జరిగిన సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ ఓట్ల తొలగింపునకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. ముఖ్యంగా దళితులు, అత్యంత వెనుకబడిన వర్గాల ఓట్లను లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు. ఓటు ప్రజల హక్కు అని, అది ప్రభుత్వ సొంత ఆస్తి కాదని అన్నారు.
సీఈసీపై రాహుల్ గురి..
ఎస్ఐఆర్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ 19కిపైగా విపక్ష పార్టీలు ఇప్పటికే ఢిల్లీలో నిరసనలు చేపట్టాయి. రాష్ట్రపతికి వినతిపత్రం ఇచ్చాయి. సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాయి. నవంబర్ 1న రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన సభలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఆయన తర్వాత ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ తదుపరి టార్గెట్ అని రాహుల్ గాంధీ ప్రకటించారు. కాగా, గతంలో వాయిదా పడిన భోపాల్ సభను ఇప్పుడు నిర్వహించాలని కూటమి నిర్ణయించింది.
