హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించే చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం గురువారం ఘనంగా ప్రారంభమైంది. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క చేయూత పెన్షన్లను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4.89 లక్షల మంది లబ్ధిదారులకు సంబంధించిన పింఛన్ నిధులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
ఎలాంటి జాప్యం, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అత్యంత పారదర్శకంగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా పెన్షన్ డబ్బులు జమ కావడంతో పింఛన్దారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. సాంకేతిక అవాంతరాలు లేకుండా, లబ్ధిదారులందరికీ సకాలంలో సాయం అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో ఈ చేయూత పెన్షన్ల జమ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించారు. 4.89 లక్షల మంది లబ్ధిదారుల వివరాలను సరిచూసి, అచ్చంపేట సభ ద్వారా నిధులు విడుదలయ్యేలా ఏర్పాట్లను సమన్వయం చేశారు.
