- తొందరగా ఎన్నికలు నిర్వహించాలి : ఎమ్మెల్యే శ్రీగణేష్
కంటోన్మెంట్, వెలుగు : కంటోన్మెంట్ బోర్డులో కొనసాగుతున్న నామినేటెడ్ రాచరిక వ్యవస్థను తక్షణమే రద్దు చేసి, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్డిమాండ్ చేశారు.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం నిర్వహించిన ‘సంవిధాన్ రక్షా కార్యక్రమంలో ఆయన పాల్గొని తర్వాత మీడియాతో మాట్లాడారు. కంటోన్మెంట్లో 2020 నుంచి ఎన్నికలు నిర్వహించకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, ఒకే ఒక్క నామినేటెడ్ సభ్యుడి చేతిలో బోర్డును పెట్టి వారసులకు పదవులు కట్టబెడుతున్నారని మండిపడ్డారు.
కేంద్రం రూ.1,200 కోట్ల సర్వీస్ టాక్స్ బకాయిలను విడుదల చేయకుండా, కేవలం జీతాల కోసం గ్రాంట్-ఇన్-ఎయిడ్ ఇస్తూ కాలయాపన చేస్తోందని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, స్థానిక ఎంపీగా ఈటల రాజేందర్, నామినేటెడ్ సభ్యుడిగా బీజేపీ నేత ఉన్నప్పటికీ.. ఈ ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ తో కంటోన్మెంట్‌కు ఒక్క పైసా కూడా రాలేదని ఎద్దేవా చేశారు.
ఎంపీ ఈటల ఢిల్లీలో రక్షణ మంత్రితో మాట్లాడి నిధులు, ఎన్ఓసీలు తీసుకురాకుండా స్థానిక నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ టూరిస్ట్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ అభివృద్ధికి కోట్లాది రూపాయలు మంజూరు చేసినా, రక్షణ శాఖ ఎన్ఓసీలు ఇవ్వకపోవడంతో పనులు నిలిచిపోయాయని ఎమ్మెల్యే వివరించారు.
ముఖ్యమంత్రి మంజూరు చేసిన రూ.5 కోట్ల ప్రత్యేక నిధులు సైతం ఎన్ఓసీ రాకపోవడంతో ల్యాప్స్ అయ్యాయని అన్నారు. వచ్చే నెలలో నామినేటెడ్ సభ్యుడి పదవీకాలాన్ని పొడిగించకుండా రద్దు చేయాలని కోరుతూ ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ సహా కేంద్ర పెద్దలకు లేఖలు పంపుతున్నట్లు తెలిపారు.
కంటోన్మెంట్ విలీనం, ఎన్నికల కోసం ఎంపీ ఈటల రాజేందర్ ఢిల్లీలో దీక్ష చేపడితే, పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సంపూర్ణ మద్దతు ఇస్తామని శ్రీగణేష్ బహిరంగ సవాల్ విసిరారు.
