మహిళా రిజర్వేషన్ బిల్లును రాహుల్ ఆపలేరు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా

మహిళా రిజర్వేషన్ బిల్లును రాహుల్ ఆపలేరు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా
  •  బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యూసీసీ తీసుకొస్తామని వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలోని మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కచ్చితంగా లభిస్తుందని, దానిని విపక్షాలు అడ్డుకోలేవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ‘‘కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల హక్కులను కాలరాసింది, ఎమర్జెన్సీ విధించింది. మేము ఓబీసీలకు హక్కులు కల్పించాం, వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు ఇచ్చాం’’ అంటూ కాంగ్రెస్ సవరణలతో బీజేపీ సవరణలను పోల్చారు. బీజేపీ అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామన్నారు.

 ‘‘రాజ్యాంగ నిర్మాతలు దేశంలో ఉమ్మడి పౌరస్మృతి రావాలని చెప్పారు. దేశంలో ప్రతిఒక్కరూ సమానంగా జీవించాలి. బీజేపీ పాలిత ప్రతి రాష్ట్రంలోనూ మేము యూసీసీని తీసుకొస్తాం’’ అని అమిత్‌ షా పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం ఢిల్లీలో నిర్వహించిన పార్టీ ‘సంవిధాన్ గౌరవ్ దివస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏకీకృత, సమగ్రత కోసం జీఎస్టీ..
పన్నుల వ్యవస్థలో ఏకీకృత, సమగ్రత కోసం వస్తు సేవల పన్ను (జీఎస్టీ) తీసుకొచ్చేందుకు 101వ రాజ్యాంగ సవరణ చేశామని అమిత్ షా తెలిపారు. 

జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రాజ్యాంగ హోదా కల్పించేందుకు 102వ సవరణ, ఇప్పటివరకు రిజర్వేషన్ ఫలాలు అందని ఆర్థికంగా బలహీన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు 103వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చామని గుర్తుచేశారు. ‘‘ఆ తర్వాత 106వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో నారీ శక్తికి 33 శాతం రిజర్వేషన్ కల్పించాం. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలనేది బీజేపీ సంకల్పం. దీనిని ఆపే శక్తి రాహుల్ గాంధీకి లేదు” అని స్పష్టం చేశారు. నానమ్మ ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించినందున, రాజ్యాంగాన్ని కాపాడతామని మాట్లాడే అర్హత రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లేదని విమర్శించారు. 20 ఏండ్లుగా ఎన్నికల్లో ఓడిపోవడమే రాహుల్ సమస్య అని ఎద్దేవా చేశారు.