దేశం పట్ల విధులే మనకు ఫస్ట్ ప్రయారిటీ.. రాజ్యాంగ దినోత్సవం వేళ ప్రధాని మోదీ పిలుపు

దేశం పట్ల విధులే మనకు ఫస్ట్ ప్రయారిటీ.. రాజ్యాంగ దినోత్సవం వేళ  ప్రధాని మోదీ పిలుపు
  • సామాన్యుడికి కలలు కనే శక్తినిచ్చిందే రాజ్యాంగం
  •  నా ప్రస్థానమే అందుకు నిదర్శనమన్న ప్రధాని

న్యూఢిల్లీ: దేశం పట్ల మనకున్న విధులకే ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రత్యేక సందేశం విడుదల చేశారు.1949లో ఇదే రోజున రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిందని, దీనిని స్మరించుకుంటూ 2015లో ఎన్డీయే ప్రభుత్వం నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించిందని గుర్తుచేశారు. 

పేద కుటుంబం నుంచి వచ్చిన తనలాంటి వ్యక్తి 24 ఏళ్లకు పైగా నిరంతరాయంగా ప్రభుత్వాధినేతగా సేవ చేస్తున్నానంటే అది మన రాజ్యాంగం ఇచ్చిన శక్తి వల్లేనని మోదీ అన్నారు. 2014లో మొదటిసారి పార్లమెంట్ మెట్లకు నమస్కరించిన క్షణాలు, 2019లో సంవిధాన్ సదన్​లో రాజ్యాంగాన్ని నుదుటిపై పెట్టుకుని గౌరవించిన సందర్భాలను గుర్తుచేసుకున్నారు. రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, అంబేద్కర్, మహిళా సభ్యులను స్మరించుకున్నారు.

ఈ ఏడాది ఎన్నో ప్రత్యేకతలు

2010లో రాజ్యాంగం 60 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పుడు జాతీయ స్థాయిలో తగిన గుర్తింపు లభించలేదని, అప్పుడు గుజరాత్​లో ఏనుగుపై రాజ్యాంగాన్ని ఉంచి ‘సంవిధాన్ గౌరవ్ యాత్ర’ నిర్వహించామని మోదీ తెలిపారు. రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రికార్డు స్థాయి ప్రజల భాగస్వామ్యంతో ఉత్సవాలు జరిపామన్నారు. ఈ ఏడాది సర్దార్ వల్లభాయ్ పటేల్, భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నామని చెప్పారు. పటేల్ స్ఫూర్తితోనే ఆర్టికల్ 370, 35(ఏ)లను రద్దు చేసి జమ్ము కశ్మీర్​లో రాజ్యాంగాన్ని అమలు చేశామన్నారు. వందేమాతరం 150వ వార్షికోత్సవం, శ్రీ గురు తేగ్ బహదూర్ జీ 350వ బలిదాన దినోత్సవాలను కూడా ఈ ఏడాది స్మరించుకుంటున్నామని పేర్కొన్నారు.

ఓటు హక్కును వదులుకోవద్దు

ఆర్టికల్ 51ఏ ప్రాథమిక విధుల ప్రాముఖ్యతను చెబుతోందని, విధులు నిర్వర్తిస్తేనే నిజమైన హక్కులు లభిస్తాయని గాంధీ చెప్పేవారని మోదీ గుర్తుచేశారు. మనం నేడు తీసుకునే నిర్ణయాలే 2047 స్వాతంత్ర్య, 2049 రాజ్యాంగ శతాబ్ది ఉత్సవాల నాటి తరాల భవిష్యత్తును నిర్దేశిస్తాయన్నారు. పౌరులంతా ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని, నవంబర్ 26న స్కూళ్లు, కాలేజీల్లో 18ఏళ్లు నిండిన యువతకు ప్రత్యేక వేడుకలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.