- ఎమ్మెల్సీ ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల భర్తీపైనా సమాలోచన
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ బీఎం సందీప్ గురువారం ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రెండు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీలో అసమ్మతి, ప్రభుత్వ పథకాలపై ప్రజాభిప్రాయం, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డితో మూడు రోజుల క్రితం సందీప్ విడివిడిగా సమావేశమయ్యారు. పార్టీ, ప్రభుత్వంపై బహిరంగంగా చేసిన వ్యాఖ్యలకు కారణాలను అడిగి తెలుసుకున్నారు.
వారి వివరణ, అభిప్రాయాలను సీఎంకు వివరించినట్లు సమాచారం. ఈ వివాదానికి త్వరగా ముగింపు పలకాలని ఇద్దరు నేతలు నిర్ణయించినట్లు తెలిసింది. నామినేటెడ్ పోస్టుల భర్తీలో జాప్యంతో క్యాడర్లో పెరుగుతున్న అసహనం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. త్వరలో జరిగే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు ఖాళీగా ఉన్న మూడు మంత్రి పదవులు, గవర్నర్ కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీపైనా చర్చించినట్లు తెలిసింది.
