- ప్రపంచ సప్లై చైన్‌లో తెలంగాణను కీలక భాగస్వామిగా మారుస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో బలంగా ఉన్న ఐటీ, ఫార్మా రంగాలను మించి డిఫెన్స్, ఏరోస్పేస్ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని ఇరిగేషన్, సివిల్ సప్లైస్శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఈ రంగం ఉత్పత్తి, ఎగుమతులు ఏడాదికి వంద శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న బలమైన పారిశ్రామిక వాతావరణాన్ని, ప్రపంచవ్యాప్తంగా రక్షణ, ఏరోస్పేస్ మార్కెట్లలో వస్తున్న కొత్త అవకాశాలను పారిశ్రామికవేత్తలు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లో ‘తెలంగాణ టు గ్లోబల్ మార్కెట్స్ – బిల్డింగ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సప్లై చైన్స్’ అనే థీమ్‌తో నిర్వహించిన ‘సీఐఐ తెలంగాణ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కాన్క్లేవ్–2026’లో ఆయన పాల్గొన్నారు. ప్రపంచ రక్షణ, ఏరోస్పేస్ తయారీ నెట్‌వర్క్‌లో తెలంగాణ కీలక భాగస్వామిగా ఎదిగేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని ఉత్తమ్ పేర్కొన్నారు. హైదరాబాద్, తెలంగాణ అనగానే ఇప్పటివరకు ఐటీ, ఫార్మా రంగాలే గుర్తుకొచ్చేవని, కానీ ఇప్పుడు డిఫెన్స్, ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం పెట్టుబడులు, ఎగుమతులు, ఉపాధి కల్పనలో అపారమైన అవకాశాలతో వేగంగా ఎదుగుతోందని వెల్లడించారు.
హైదరాబాద్‌కు సహజసిద్ధమైన బలం
రక్షణ పరిశోధనలు, ఏరోస్పేస్ తయారీతో హైదరాబాద్‌కు దశాబ్దాల అనుబంధం ఉందని, ఇదే తెలంగాణకు కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో సహజసిద్ధమైన బలాన్ని ఇస్తోందని మంత్రి ఉత్తమ్ వివరించారు. ఇక్కడ ప్రతిష్టాత్మక డిఫెన్స్ రీసెర్చ్ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రముఖ ప్రైవేట్ కంపెనీలు, ఎంఎస్ఎంఈలతో పాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని గుర్తుచేశారు. ఈ ఎకోసిస్టమ్‌ను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈ) ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. పెద్ద కంపెనీలు, అంతర్జాతీయ తయారీదారులు ఎంఎస్ఎంఈలతో కలిసి పనిచేయాలని, తద్వారా వారు అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలను అందుకునేలా సహకరించాలని సూచించారు.
